-ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరమ్ ఆందోళన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరలు పెంచితే థియేటర్ల మనుగడ మరింత కష్టమవుతుందని, సామాన్యులకు వినోదం దూరమవుతోందని అందుకే ధరల పెంపు జీవోలు ఇవ్వవద్దని ఆంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్నీ ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరమ్ కోరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు 2,000కు పైగా వెలిగిన సినిమా థియేటర్ల సంఖ్య ప్రస్తుతం 1,200కు పడిపోయిందని, గత 3-4 సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే సుమారు 400 థియేటర్లు మూతపడటం సినీ పరిశ్రమ రంగం తీవ్ర సంక్షోభానికి అద్దం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
విజయవాడ గవర్నర్‌పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో శుక్రవారం ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరమ్ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ విచ్చేసారు . ఈ సందర్భంగా ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీనియర్ ఎగ్జిబిటర్ యలమంచిలి రామచంద్రరావు, ఫోరం కార్యదర్శి గోరంట్ల బాబు మాట్లాడారు.
థియేటర్ల నిర్వహణలో ఎదురవుతున్న సాంకేతిక, ఆర్థిక ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రస్తుతం ఫైర్, సినిమాటోగ్రాఫ్ తదితర శాఖల లైసెన్స్ గడువులు వేర్వేరుగా ఉండటం వల్ల ఎగ్జిబిటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అన్ని శాఖలకు సంబంధించి ఒకే విధానంలో 5 ఏళ్ల కాలపరిమితితో ‘సింగిల్ విండో సిస్టమ్’ ద్వారా లైసెన్స్ రెన్యూవల్స్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. టూరిజం, హోటల్ రంగానికి వర్తింపజేస్తున్నట్లుగానే సినిమా రంగానికి, థియేటర్లకు కూడా ‘ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్’ వర్తింపజేయాలన్నారు. పెరిగిన జీతాలు, విద్యుత్ ఛార్జీలు, ఆధునీకరణ ఖర్చుల దృష్ట్యా థియేటర్ల నిర్వహణ ఛార్జీలను కొంత పెంచాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అనే వ్యత్యాసం లేకుండా అన్ని కేటగిరీల థియేటర్లకు ప్రజలకు అందుబాటులో ఉండేలా యూనిఫామ్ టికెట్ ధరలను సమీక్షించాలని కోరారు. థియేటర్ల మనుగడ కాపాడటానికి, కొత్త సినిమాలు విడుదలైన కనీసం 8 వారాల తర్వాతే ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌లలో వచ్చేలా నిబంధన విధించాలని నిర్మాతలు, ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం ఫోరమ్ జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ, టికెట్ రేట్లు విపరీతంగా పెంచడం వల్ల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రేక్షకులు థియేటర్లకు రావడం పూర్తిగా మానేస్తున్నారని స్పష్టం చేశారు. రేట్లు పెంచకుండా విడుదల చేసిన ‘ఇరుముడి’, సమంత చిత్రం, ‘డీసీ’ వంటి సినిమాలకు భారీగా రెవెన్యూ రావడం దీనికి నిదర్శనమని గుర్తుచేశారు. టికెట్ ధరలు పెంచితే థియేటర్ల మనుగడ మరింత కష్టమవుతుందని, అందుకే ధరల పెంపు జీవోలు ఇవ్వవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. టికెట్ రేట్లు పెంచడం వల్ల వచ్చే అదనపు ఆదాయం ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లకే వెళ్తుంది తప్ప థియేటర్ యాజమాన్యాలకు ఒక్క రూపాయి కూడా దక్కదని వివరించారు. పైగా అధిక ధరల వల్ల సామాన్య ప్రజలు థియేటర్ యాజమాన్యాన్నే తప్పుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లులు, సీటింగ్ వంటి నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగినందున, కేవలం థియేటర్ మెయింటెనెన్స్ ఛార్జీలు మాత్రమే పెంచుకునేందుకు అనుమతించాలని ఆయన కోరారు.
సమావేశంలో విజయవాడ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముత్తవరపు శ్రీనివాస్ బాబు, ఫోరం సంయుక్త కార్యదర్శి పర్వతనేని శ్రీనివాసరావు,సభ్యులు రాంప్రసాద్, పలువురు ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News