-క్యాపిటల్ సినిమాస్‌లో ప్రత్యేక వీక్షణ!
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘మా రాముడు అందరివాడు’ చిత్రం శుక్రవారం విజయవాడ నగరంలో ఘనంగా విడుదలైంది. ఈ సందర్భంగా క్యాపిటల్ సినిమాస్ (ట్రెండ్ సెట్) థియేటర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనకు చిత్ర బృందం హాజరై సందడి చేసింది. నటుడు సుమన్, ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూనే ప్రతినాయకుడి (విలన్) పాత్ర పోషించిన అనుముల లక్ష్మణరావు తదితరులు కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం చిత్రం విజయం సాధించిన సందర్భంగా కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నటుడు సుమన్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో ఒక చిత్రాన్ని నిర్మించడం కంటే దానిని థియేటర్ల వరకు తీసుకురావడం ఎంతో సవాలుతో కూడుకున్న విషయమని అన్నారు. చిన్న చిత్రాల నిర్మాతలు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సినిమాలు తీస్తున్నారని తెలిపారు. ఈ చిత్రంలో గ్రామీణ నేపథ్యం, మంచి ట్విస్టులతో కూడిన కథ ఉందన్నారు. అనుముల లక్ష్మణరావు తొలిసారిగా నిర్మిస్తూ, విలన్‌గా విభిన్న ఎమోషన్లు బాగా పండించారని కొనియాడారు. సాంకేతిక బలంతో పాటు అద్భుతమైన సంగీతం, కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
చిత్ర నిర్మాత, విలన్ అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ… ‘మా రాముడు అందరివాడు’ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సినిమాలో ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయని, ప్రతి పాట కూడా కథకు తగ్గట్లుగా ఉంటుందని తెలిపారు. సుమన్ గారు సీఎంగా కీలక పాత్రలో నటించారని, హీరో శ్రీరామ్ ద్విపాత్రాభినయంలో ఆకట్టుకున్నారని చెప్పారు. తండ్రి సెంటిమెంట్, పవర్‌ఫుల్ డైలాగులు, మంచి సంగీతం ఉన్న ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూసి ఆశీర్వదించాలని కోరారు.
ప్రముఖ ఆర్యవైశ్య నేత కొనకళ్ళ విద్యధరరావు మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో అందమైన లొకేషన్స్ మధ్య అద్భుతంగా చిత్రీకరించిన మా రాముడు అందరివాడు చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని కోరారు.
Prajavartha Online Telugu News