-ఆంధ్రప్రదశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని మంగళవారం (డిసెంబర్ 7న) జరుపుకుంటున్న నేపధ్యంలో జెండా దినోత్సవ నిధికి ఉదారంగా విరాళాలు ఇచ్చి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సాయుధ దళాల సభ్యులు యుద్ధం, శాంతిలో చేసిన వీరత్వాన్ని, త్యాగాన్ని గర్వంగా గుర్తుచేసుకునే సందర్భమే సాయుధ బలగాల జెండా దినోత్సవమని గవర్నర్ హరిచందన్ అన్నారు. సాయిధ దళాల దేశభక్తి, ధైర్యం, అచంచలమైన త్యాగ స్ఫూర్తికి దేశం గర్విస్తుందని, యుద్ధం, శాంతి సమయాలలో ఇది ప్రస్పుటం అయ్యిందన్నారు. అత్యున్నత త్యాగానికి ప్రతీకలుగా అమరవీరులను గౌరవించడంతో పాటు వీర సైనికులు, నావికులు, వైమానికులకు వందనాలు సమర్పించేలా ‘సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి’కి సహకారం అందించే ప్రతి ఒక్కరూ ప్రశంసనీయులన్నారు. రాష్ట్రంలో నివసిస్తున్న మాజీ సైనికులు, వీరనారులు, వీరమాతలు, వారి కుటుంబాలకు సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధిని వినియోగిస్తున్నారని గవర్నర్ తెలిపారు. ఈ కార్యక్రమాలను ఉదారమైన స్వచ్ఛంద భాగస్వామ్యం అవసరమని గౌరవ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.