-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు అజరామరమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. మహా పరినిర్వాణ్ దివస్ పేరిట భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్న తరుణంలో సోమవారం సామాజిక మాధ్యమ వేదికగా గవర్నర్ ఆయనకు నివాళి అర్ఫించారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొంటూ అంబేద్కర్ సమాజంలోని అంటరానితనం, కులవివక్షలకు వ్యతిరేకంగా సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసారన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలు ఎప్పటికీ ఆదర్శప్రాయమన్న గవర్నర్, దేశ ప్రజలంతా రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషిచేయడమే ఆయనకు నిజ నివాళి అన్నారు. అంబేద్కర్ ప్రబోధించిన సిద్ధాంతాలు నిత్య చైతన్య స్పూర్తిగా నిలుస్తాయన్నారు. రాజ్యాంగం ద్వారా డాక్టర్ అంబేద్కర్ కల్పించిన పౌర హక్కులు, ఆదేశిక సూత్రాలు ప్రజలకు రక్షణగా నిలుస్తున్నాయని, అంబేద్కర్ చూపిన మార్గం ఆచరణీయమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.