-దేశ రక్షణ, భద్రతలో భారత్ ఎలక్ట్రానిక్స్ కు ప్రత్యేక స్థానం- మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని శనివారం స్థానిక భారత్ ఎలక్ట్రానిక్స్ సందర్శించారు. ఆజాదీకా మహోత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈనెల 13 నుండి 19వ తేదీ వరకు భారత్ ఎలక్ట్రానిక్స్ లో తయారయ్యే దేశ రక్షణ పరికరాల ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాటు చేయుచున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల, కళాశాల విద్యార్థులు ఈ అవకాశమును సద్వినియోగము చేసుకోవాలని తెలిపారు. భారత్ ఎలక్ట్రానిక్స్ తయారుచేసిన పరికరాలు యుద్ధములో వాడినప్పుడు సైనికులు పొందే అనుభూతి వాటిని చూసినప్పుడు విద్యార్థులు కూడా గొప్ప అనుభూతి పొందగలరని మంత్రి అన్నారు. దేశ రక్షణ కు వాడే పరికరాలు మన మచిలీపట్నంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లో తయారు కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ జనరల్ మేనేజర్ బి ప్రభాకర్ రావు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.