విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాన్య ప్రజలకు న్యాయ సహయంపై దశ, దిశ నిర్దేశం చేయవలసిన బాధ్యత సమాజంలోని మేధావి వర్గంపై ఉందని సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. జీవిత సాఫల్య అవార్డ్ ను స్థానిక సిద్దార్థ కళాశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంటకరమణకి విజయవాడ రోటరీ క్లబ్ ప్రతినిధులు అందజేశారు. ఎన్. వి. రమణ దంపతులను మెమెంటో, పుష్పగుచ్చం, దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెంకట రమణ మాట్లాడుతూ సమాజంలోని ప్రతీ పౌరుడూ రాజ్యాంగం తనకు కల్పించిన హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలన్నారు. కోర్ట్, పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కేందుకు ఏ మనిషీ ఇష్టపడడని , అయినప్పటికీ ప్రతీ మనిషికీ ఏదైనా కష్టం వచ్చినప్పుడే కోర్ట్, పోలీస్ స్టేషన్ గుర్తుకువస్తాయన్నారు. అటువంటి సమయంలో పోలీస్ స్టేషన్, కోర్టులకు వెళ్ళితే తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. కోర్ట్ లో అర్ధం కానీ మాట్లాడకుండా, న్యాయవాది మాట్లాడేటి, తన కేసుపై జరిగే వాదన, తీర్పు బ్రహ్మ పదార్థం లాగా కాక సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో ఉండెలా సంస్కరణలు రావాలన్నారు. , సమాజంలోని మేధావి వర్గంగా గుర్తింపు పొందిన న్యాయవాదులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు సామాన్యలు ఆశించే న్యాయ సహాయం అంశాలపై, ప్రాధమిక హక్కులు, బాధ్యలపై అవగాహనా కలిగించేందుకు కృషి చేయాలన్నారు. రోటరీ క్లబ్ తరపున న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రతీ వ్యక్తికి న్యాయం పొందడం హక్కన్నారు. రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించే ప్రాధమిక హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగించాలన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సామాన్య ప్రజలకు న్యాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుత రోజులలో సామాన్య ప్రజలు సైతం రాజ్యాంగం, ప్రాధమిక హక్కులపై చర్చ జరగడం శుభపరిణామమన్నారు. రోటరీ క్లబ్ జీవిత సాఫల్య పురస్కారం నాకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్ట, తెలుగు వారి కీర్తి ప్రతిష్టలకు మరింత గౌరవం పెరిగేలా కృషిచేస్తానన్నారు. స్వాత్రంత్యం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల్లో నిరక్షరాస్యత, , మూఢనమ్మకాలు వంటివి తొలగేలా చైతన్యం తీసుకురావలసిన అవసరం ఉందన్నారు. 130 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలోని వౌటైల్స్లో 4 కోట్ల 60 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. కోర్టులలో చిన్న చిన్న కేసులు ఎక్కువ రోజులు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వం, కార్యనిర్వాహక వర్గం చట్ట పరిధిలో పని చేస్తే ఎవరు కోర్ట్ కి తెచ్చే పని ఉండదు అన్నారు రూల్ అఫ్ లా సక్రమంగా అమలు కావాలని, అలాకాని రోజుల ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లుతుందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 19 ఉల్లంఘన జరిగితే ప్రతీ ఒకారూ ప్రశ్నించేలా చైతన్యం రావాలన్నారు. పౌర హక్కులకు భంగం కలిగితే కోర్టులు జోక్యం చేసుకుంటామన్నారు. దేశంలో న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని, ఖాళీగా ఉన్న జడ్జీల పోస్టులు, సిబ్బంది భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు. ఇతర భాషలలో ప్రావీణ్యానికి మాతృ భాష పునాదని,, తెలుగు వారు ప్రతీ ఒక్కరూ తెలుగులోనే మాట్లాడి తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణా రాష్ట్ర హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర మిశ్రా, సుప్రీమ్ కోర్ట్ జడ్జి జె.కె.మహేశ్వరి, సిద్దార్థ కాలేజ్ వైస్ ఛాన్సలర్ మలినేని రాజయ్య, వైస్ ప్రెసిడెంట్ సి.నాగేశ్వరరావు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వి.ఎన్.ఎల్.ప్రసాద్, జిల్లా గవర్నర్ ఎం. రామారావు, రోటరీ క్లబ్ ప్రతినిధులు పట్టాభిరామయ్యా, ఎం.సి.దాస్, మోహన్ ప్రసాద్, వివిధ జిల్లాల న్యాయమూర్తులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రభృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దార్ధ కళాశాల యాజమాన్యం జస్టిస్ ఎన్ .వి. రమణ సేవలను తెలియజేస్తూ ప్రశంసాపత్రాన్ని అందజేశారు.