-విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మికాంతం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక అభివృద్ధికి కళలు దోహదపడాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.లక్ష్మీకాంతం అన్నారు. బుధవారం స్థానిక హన్ మాన్ పేట ప్రెస్ క్లబ్ లో ప్రముఖ సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ అర్పిత 20 వ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను విదేశీయులు అనుకరిస్తూ ఉంటే ప్రాశ్చాత్య పోకడలను భారతీయ యువత అనుకరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు అరుదుగా రావటం కూడా యువత పెడత్రోవకు కారణం కావచ్చని ఆయన సందేహం వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎందరో కవులు, కళాకారులు, విద్య,సామాజిక వేత్తలతో గత 20 ఏళ్లుగా అర్పిత సంస్థ కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. ఇందుకు సంస్థ నిర్వాహకుడు డా.గణగళ్ళ విజయ్ కుమార్ ప్రశంసించాలని సభికుల హర్షధ్వానాల మధ్య పేర్కొన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సమాజ సేవ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో ఈ సంస్థ మార్గదర్శకంగా నిలుస్తుందని కొనియాడారు. లక్షలాది రూపాయల వ్యయంతో ప్రతినెలా క్రమం తప్పకుండా అనాధలకు, వృద్ధులకు, వికలాంగులకు సేవా కార్యక్రమాలను నిర్వహించడం తేలికకాదని ఇందులో డా.గణగళ్ళ విజయ్ కుమార్ సఫలీకృతులయ్యారని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు బాధ్యతతో మెలగాలని సూచించారు. పిల్లలకు చిన్న నాటి నుంచే చదువుతోపాటు కళలపై మక్కువ కలిగించేలా తల్లిదండ్రులు ప్రయత్నించాలని అన్నారు. టెక్నాలజీతో పాటు సంస్కృతిని కూడా విద్యార్థులకు నేర్పాలని కోరారు.
అర్పిత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.గణగళ్ళ విజయ్ కుమార్ ప్రసంగిస్తూ విశాఖలో 20 ఏళ్ల క్రితం ఏర్పడిన సంస్థ నేడు 16 రాష్ట్రాలు, 3 దేశాల్లోని తెలుగు ప్రతిభావంతులకు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా చేరువ కావడం విశేషం అని అన్నారు. అర్పిత సంస్థ ద్వారా గుర్తింపు బడ్డవారు ఎందరో అత్యున్నత ప్రభుత్వ పురస్కారాలను పొందారని వివరించారు. ఈ కోవలో విద్యావేత్తలు, కళాకారులు, సామాజికవేత్తలే కాకుండా న్యాయమూర్తులు సైతం ఉండటం అర్పిత సంస్థ ప్రత్యేకమని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి పలువురు కళాకారుల ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. పలు రంగాల్లో ప్రతిభ గల 25 మందికి ఈ అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్బంగా కొండా పల్లవి, బాల సరస్వతి చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో 47 వ.డివిజన్ కార్పొరేటర్ చైతన్య రెడ్డి,కరెడ్ల అప్పలరాజు, మహాలక్ష్మి ,మేరీ, అన్నపూర్ణ, రమాదేవి, ప్యారీ, మూర్తి, బేబీ,దానయ్య, తదితరులు కార్యక్రమం నిర్వహణలో పాలు పంచుకున్నారు.