మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కాయ కష్టం చేస్తే గాని పూట గడవని నిరుపేదలకు సొంతిల్లు సమకూరడం సామాన్య విషయం కాదని, మన రాష్ట్రంలో 31 లక్షల మందికి , కృష్ణాజిల్లాలో 3 లక్షల 34 వేల మందికి, అలాగే మచిలీపట్నం నియోజకవర్గంలో 26 వేలకు పైగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరయినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.
బుధవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొని అనేక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
తొలుత మచిలీపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు కొందరు మంత్రిని కలిసి తమ ఊరి దళితవాడలో కొందరికే ఇళ్లస్థలాలు ఇచ్చి మరికొందరికి ఇప్పటికీ ఇవ్వలేదని కొన్నిపేర్లు మిగిలిపోయాయని చెప్పారు. ఈ విషయమై స్పందించిన మంత్రి మాట్లాడుతూ, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల స్థలాలు కార్యక్రమంలో భాగంగా మీ గ్రామానికి వచ్చి గ్రామసభ నిర్వహించి అందరి ఎదుట అర్హులైన లబ్ధిదారుల పేర్లు చదివేనని ఏమైనా అభ్యoతరాలు ఉంటే తెలియచేయమని సభాముఖంగా మైకులో అడిగేనా లేదాని వారిని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. స్థానిక వి ఆర్ ఓ శైలజ నిజాయితీగా నిక్కచ్చిగా వాస్తవ లబ్ధిదారులను ఎంపిక చేసిందని అన్నారు. మనం ఎవరూ ఊహించని స్థాయిలో పేదలకు ఎంతో పారదర్శకంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారని తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా చింతూరు ప్రాంతంలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్న వరలక్ష్మి అనే మహిళ తన భర్త తండ్రితో కలిసి వచ్చి మంత్రిని కలిసింది. చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో లెక్చరర్ గా ఉద్యోగం చేయడం ఎంతో కష్టంగా ఉందని మరోచోటుకు బదిలీ చేయాలనీ కోరింది. మీ ఉన్నతాధికారి ఆదేశించిన తర్వాత నా వద్దకు ఆలస్యంగా వచ్చి ఇప్పుడు కోరుకొన్నచోటుకు మార్చమని అడగడం భావ్యం కాదని, ఏజెన్సీ ప్రాంతంలో పిల్లలకు విద్య ఎవరు చెబుతారని మీ అధికారి నన్ను అడిగితే నేనేమి మాట్లాడగలను అని మంత్రి పేర్ని నాని ఆమెకు నచ్చచెప్పారు.
మచిలీపట్నం మండలం శిరివెళ్లపాలెం గ్రామనికి చెందిన ఒక మహిళ మంత్రిని కలిసి తన కష్టాన్ని చెప్పుకొంది. శిరివెళ్లపాలెం ఆంజనేయ గుడి స్వామి సమీపంలో ప్రభుత్వ భూమిలో చిన్న షెడ్ వేసుకొని వున్నానని, ఇప్పుడు నీకు స్థలం వేరేచోట వచ్చిందని ఇక్కడ ఖాళీ చేసి అక్కడకు వెళ్లిపొమ్మని స్థానిక అధికారులు అంటున్నారని ఆమె తెలిపింది.
పొట్లపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ గాజుల నాగరాజు మంత్రిని కలిశారు. తమ గ్రామ పరిధిలో విద్యుత్ స్థంబాలు అవసరమని కొత్తపూడి గ్రామంలో 10 పోల్స్ , పొట్లపాలెంకు 9 పోల్స్ అవసరం ఉందని చెప్పారు. ఎలక్ట్రికల్ ఏ ఈ అంగీకరించారని, సింగల్ వైర్ మార్చాలని ట్రిపుల్ వైర్ వేద్దామని ఆయన గత సంవత్సర కాలం నుంచి అంటూనే వున్నారని ఇప్పటికి ఆ వైరు రాలేదని ఎప్పుడు అడిగినా ఇదిగో అదిగో అంటున్నారని తమరు దయచేసి స్థంబాలు, వైరు మంజూరు అయ్యేలా సహాయం చేయాలనీ సర్పంచ్ మంత్రిని అభ్యర్ధించారు.
Tags machilipatnam
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …