Breaking News

జగనన్న పాలవెల్లువ వచ్చింది … తక్కువ ధర ఇచ్చే పాల డెయిరీలకు ఇక కాలం చెల్లినట్లే…

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రైవేట్ పాల డెయిరీల ఆధిపత్యానికి జగనన్న పాలవెల్లువ పథకం ద్వారా అడ్డుకట్ట వేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
బుధవారం నూజివీడు మండలం బోరవంచ గ్రామంలో పాలవెల్లువ పథకానికి వర్చువల్ గా శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, జిల్లాపరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, వైస్ ఛైర్మన్ జి.కృష్ణంరాజు, గ్రామ సర్పంచ్ ఉదయ్ శంకర్, జగనన్న పాలవెల్లువ సహాకార సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తక్కువ ధరకే పాలు కొనుగోలు చేస్తూ మహిళా పాడి రైతులను ప్రైవేట్ డెయిరీలు ఇబ్బందులకు గురిచేశారన్నారు. అయితే అమూల్ సంస్థ కొనుగోలు చేయడం ప్రారంభించగానే ప్రైవేట్ డెయిరీలు కూడా పాల సేకరణ ధరను పెంచడం శుభ పరిణామమన్నారు. కృష్ణాజిల్లాలో ఇప్పటి వరకు 264 గ్రామాల్లో 37,474 మంది మహిళా పాడి రైతులను గుర్తించారన్నారు. గత వారం రోజులుగా 51 కేంద్రాలలో 18,414 లీటర్లు పాలు సేకరించారన్నారు. అందులో 941 రైతుల బ్యాంకు ఖాతాలకు 8.5 లక్షల రూపాయలు కూడా చెల్లించారన్నారు. పాల అమ్మకంపై మంచి ధర వస్తుండటంతో రైతులు కూడా ఉత్సాహం చూపుతున్నారన్నారు. చాట్రాయి మండలం సోమవరం గ్రామానికి చెందిన వెంకట నరసమ్మ అనే పాడి రైతు గతంలో కృష్ణాజిల్లా పాల ఉత్పత్తి సహకార సంఘానికి పాలు పోసేవారన్నారు. లీటరు ధరకు కేవలం రూ.44.80 వచ్చేదన్నారు. అయితే జగనన్న పాలవెల్లువ సేకరిస్తున్న ధర అమాంతంగా రూ.74.78లు రావడం ఆశ్చర్యచకితులను చేస్తుందన్నారు. ఒక్కో లీటరుపై 28 నుంచి 30 రూపాయల దాకా అదనపు మొత్తం అందుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తక్కువ ధర చెల్లించే మిల్క్ డెయిరీలకు ఇక కాలం చెల్లినట్లే అన్నారు. జగనన్న పాలవెల్లువలో అమూల్ సంస్థకు యజమానులు మీరేనంటూ సీఎం వ్యాఖ్యానించారు. అమూల్ సంస్థ లాభాపేక్షతో పనిచేయదని, వారికి ఉన్న ప్రాసెసింగ్ విధానం కూడా రాష్ట్రంలో ఏ ఇతర డెయిరీల వద్దా లేదన్నారు. 6 నెలలు నిరంతరంగా పాలు పోస్తే లీటరుకు 50 పైసలు చొప్పున బోనస్ కూడా ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. నూజివీడు నుంచి జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ జిల్లాలో పాలఉత్పత్తి, సేకరణ, ప్రాసెసింగ్ ప్రారంభించామన్నారు. జిల్లాలో ఈనెల 14 న ప్రారంభించిన 3,627 మంది మహిళా సభ్యుల నుంచి 66,870 లీటర్ల పాలను సేకరించామన్నారు. మొదటి దశగా 100 గ్రామాల్లో 35 వేల మంది మహిళా సభ్యులతో సంఘాలు ఏర్పాటు చేశామన్నారు. ఏ మహిళతో మాట్లాడినా తనకు రూ.5-25 ఆదాయం వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. రెడ్డిగూడెం మండలం నుంచి జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.కె.మాధవీలత మాట్లాడుతూ మండలంలో తొలుత కేవలం ముగ్గురు రైతులతో ప్రారభించిన పాల సేకరణ పది రోజుల్లోనే 52 మందికి చేరిందన్నారు. కెడిసిసి బ్యాంకు ద్వారా జగనన్న పాలవెల్లువ సహకార సంఘ సభ్యులకు 30 వేల రూపాయలు రుణ సౌకర్యం కల్పించామన్నారు. అమూల్ సరఫరా చేసే నాణ్యమైన దాణా కూడా అందించామన్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్ చాట్రాయి మండలం పోలవరం గ్రామం నుంచి మాట్లాడుతూ మండలంలో 13 సహకార సొసైటీలు ఏర్పాటు చేశామన్నారు. అందులో 5 వేల మంది సభ్యులుగా ఉన్నారని ట్రయిలన్ సందర్భంగా 6,500 లీటర్లు పాలు కూడా సేకరించామన్నారు. ప్రతి రోజు 80 మంది మహిళలు 80 లీటర్ల పాలను అమూల్ సంస్థకు ఇస్తున్నారన్నారు. ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు గ్రామం నుంచి జాయింట్ కలెక్టర్ ( హౌసింగ్ ) శ్రీవాస్ నుపూరు అజ య్ కుమార్ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువలో మహిళలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని చెప్పారు.
జగనన్న పాలవెల్లవ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహిళలతో మాట్లాడిన కలెక్టర్ :- మహిళా రైతులకు ఆర్థిక పరిపుష్టి, మహిళా సాధికారత జగనన్న పాలవెల్లువ ద్వారా సాకారం అవుతుందన్నారు. సిఎంతో జరిగిన వర్చువల్ కాన్ఫరెన్స్ అనంతరం ఆయన అక్కడకు వచ్చిన మహిళా రైతులతో ముచ్చటించారు. జగనన్న పాలవెల్లువ ద్వారా గ్రామాలు ఆర్థిక ప్రగతి సాధించేందుకు నాంధి పలికారన్నారు. రైతుకు అధిక ధర కల్పించడమే సీఎం అభిమతమన్నారు. రాబోయే రోజుల్లో 300 గ్రామాల్లో పాలవెల్లువ పథకాన్ని పూర్తి చేసి జిల్లాను ముందుంచేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ పాడిగేదెల నుంచి పాలు తీసే విధానం తనకు తెలుసన్నారు. చిన్నప్పుడే తన తండ్రి కంట పడకుండా గేదెల నుండి పాలు పితికేవాడినన్నారు. మహిళలు వేస్తున్న పాలకు గిట్టుబాటు ధర కల్పించడమే జగనన్న పాలవెల్లువ పథకం లక్ష్యమన్నారు. 30 వేల రూపాయల రుణం, అలాగే 90 రోజులు నిరంతరంగా పాలుపోస్తే మరో 1.6 లక్షల రూపాయల రుణం కూడా అందుతుందన్నారు. ఆ రుణంతో పాడి గేదెలు కొని రైతులు పాలు విక్రయించి ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.
వర్చువల్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జరిపిన సమావేశంలో అభిప్రాయాలు పంచుకున్న కృష్ణాజిల్లా మహిళలు : విజయరాణి బోరవంచ గ్రామం , నూజివీడు మండలం :- నాకు జగనన్న పాలవెల్లువ పథకం గురించి రైతు భరోసా కేంద్రం ద్వారా తెలిసింది . రెండు గేదెలు ఉన్నాయి. ఒక సూడిగేదె. గతంలో కేవలం రూ.40 లకే లీటరు పాలను విక్రయించేదానిని. ఎస్ఎన్ఎఫ్, వెన్నశాతం గురించి మాకు తెలిసేదే కాదు. జగనన్న పాలవెల్లువ పథకంలో పాలు ఇస్తున్నప్పటి నుంచి ఎస్ఎన్ఎఫ్ పై పూర్తి అవగాహన వచ్చింది. పాలు వేసిన వెంటనే బిల్లు కూడా ఇస్తారు. అందులో వెన్న, ఎస్ఎన్ఎఫ్ వేరువేరుగా చూపిస్తారు. నాకు ఇప్పుడు రూ .64 ఆదాయం వస్తుంది. 4 లీటర్ల పాలు ఇస్తేనే 56 రూ.లు అదనపు ఆదాయం వచ్చింది. పాలవెల్లువ గొప్పతనం గురించి తోటి మహిళలందరికీ వివరించి పాలు వేసేలా చేస్తాను. ఉన్నత ధర ఇచ్చే పాలవెల్లువను ప్రోత్సహిస్తాను. అమ్మఒడి , డ్వాక్రా రుణమాఫీ కూడా అందుతున్నాయి అని ఆమె వివరించారు.
మార్తాంగి మార్తమ్మ , రాఘవపురం గ్రామం, రెడ్డిగూడెం మండలం :- నా భర్త నేను కూలి చేసుకొని కష్టంతో జీవిస్తున్నాము. నేను వేసే లీటరు పాలకు గతంలో కేవలం రూ .30 ఇచ్చేవారు . పాలవెల్లువకు వేస్తున్నప్పటి నుంచి రూ .70 ఆదాయం తీసుకుంటున్నాను. పశువులకు దాణా కూడా ఇచ్చారు. అమ్మఒడి , తన పిల్లల చదువు కొనసాగించేందుకు విద్యాదీవెన పథకం లబ్ది కూడా తన ఖాతాలో పడింది. చక్కటి పథకాలు పెట్టి ప్రోత్సహిస్తున్న మీరు ఎల్లప్పుడూ సీఎంగా నే ఉండాలి అంటూ ఉద్వేగానికి లోనైంది . ఉదయించే సూర్యుడిలా ఎల్లప్పుడు తన లాంటి మహిళల జీవితాలకు వెలుగునివ్వాలని కోరుకుంది.
వీరమ్మ, పోలవరం గ్రామం, చాట్రాయి మండలం :- నాకు నాలుగు గేదెలు ఉన్నాయి. మూడు గేదెలు పాలు ఇస్తాయి. మరో గేదె సూడిగేదె. ప్రైవేట్ డెయిరీకీ పాలు వేసేటప్పుడు లీటరుకు రూ.40-45లు ఆదాయం వచ్చేది. ఇప్పుడేమో 70 రూపాయల ఆదాయం తీసుకుంటున్నాను. ఎక్కడికి వెళ్లినా మాకు ప్రాధాన్యతనిస్తూ పనులు కూడా చేసి పెడుతున్నారు. అమ్మఒడి, ఆసరా పథకాల కింద లబ్ది పొందుతున్నాను. గేదెలను పండుగ తరువాత అమ్మేద్దామని నా భర్త రాంబాబుతో కలిసి నిర్ణయం తీసుకున్నాం. అయితే ఇంత ఆదాయం చూపినందుకు మీకు రుణపడి ఉంటాను. సభ్యులందరితో చెప్పి పాలు వేసేలా చూస్తాను. ఆడవాళ్లకు అమాంతంగా గ్రామంలో గౌరవం పెరిగింది.
లక్ష్మీ తిరుపతమ్మ, వట్టిగుడిపాడు గ్రామం, ఆగిరిపల్లి మండలం :- నాకు మూడు గేదెలు ఉన్నాయి. 6 లీటర్ల పాలు ప్రతి రోజు డెయిరీలో వేస్తాను. కానీ వెన్నశాతం బాగా లేదని కేవలం రూ.35-40లు ఇచ్చేవారు. గత 15 సంవత్సరాలుగా పాడిగేదెలపైనే ఆధారపడ్డ తన కుటుంబానికి జీవనాధారం కల్పించారు అంటూ కృతజ్ఞతలు తెలిపింది. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసింది.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *