-కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్ పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం గవర్నర్ పేటలో కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్ నూతన పాలకవర్గం కొలువుదీరడంతో కొత్త శోభ సంతరించుకుంది. ఈ మహోత్సవ వేడుకలలో శాసనసభ్యులు ముఖ్య అతిధిగా పాల్గొని సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. కాంచనపల్లి రామచందర్ రావు చైర్మన్ గా, సామంతకూరు దుర్గారావు, జవ్వాజి రంగారెడ్డి, జొన్నవిత్తుల సీతారామాంజనేయులు శర్మ, మీసాల బాలనాగమ్మ సత్యనారాయణ, వీరవల్లి వెంకట విజయలక్ష్మి ఆచారి, ఆవుల సునీత ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో హిందూ ధర్మాన్ని కాపాడుతూ, దేవాలయాల వ్యవస్థను పరిరక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. నూతనంగా కొలువుదీరిన సభ్యులందరు అంకితభావంతో పనిచేసి కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యతనివ్వడం జరిగిందన్నారు. సభ్యులందరూ బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. పూర్వం పెద్దలు దాన ధర్మాలు చేసేందుకుగానూ ట్రస్ట్ బోర్డులను నియమించేవారని మల్లాది విష్ణు అన్నారు. కానీ గత టీడీపీ హయాంలో నగరంలో ఒక కీలక నాయకురాలి కుటుంబం చేతిలో కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్ కి చెందిన ఎకరం భూమి ఆక్రమణకు గురైందని ఆరోపించారు. కనీసం అద్దెలు కూడా చెల్లించకుండా ట్రస్ట్ బోర్డును ఏళ్ల తరబడి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. దీని వల్ల పేదలకు మంచి చేయాలన్న కాంచనపల్లి కనకాంబ గారి లక్ష్యం నెరవేరడం లేదని తెలిపారు. మరోవైపు చీప్ లిక్కర్ ఇచ్చి ప్రజలను సంతోషపెడతానని సోము వీర్రాజు చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని మల్లాది విష్ణు విమర్శించారు. ఆయన వ్యాఖ్యలతో రాష్ట్రంలో బీజేపీ పరువు కృష్ణా నదిలో కలిసిందన్నారు. రాష్ట్రానికి హక్కుగా రావలసిన ప్రత్యేక హోదా, విభజన హక్కుల గూర్చి మాట్లాడకుండా.. రూ.50 కే చీప్ లిక్కర్ ఇస్తామంటూ సోము వీర్రాజు రాష్ట్ర ప్రజలను అవమానించారని మండిపడ్డారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు బాలి గోవింద్, కొంగితల లక్ష్మీపతి, జానారెడ్డి, ఉమ్మడి రమాదేవి, అలంపూరు విజయలక్ష్మి, కొండాయిగుంట మల్లేశ్వరి, బంకా శకుంతల దేవి, నాయకులు గుండె సుందర్ పాల్, అలంపూర్ విజయ్, యరగొర్ల శ్రీరాములు, కుక్కల రమేష్, మానం వెంకటేశ్వరరావు, వెన్నం రత్నారావు, కాళ్ళ ఆదినారాయణ, ఈవో Y సీతారామయ్య, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.