జగనన్న కాలనీలు .. ఇంధన సామర్ధ్యానికి లోగిళ్ళు…


-28.3 లక్షల ఇళ్లలో ఇంధన సామర్ధ్య ప్రమాణాల అమలు పై ప్రత్యేక ప్రణాళిక… : గృహ నిర్మాణ శాఖ మంత్రి , చెరుకువాడ శ్రీ రంగ నాధ రాజు
-ఏపీ గృహ నిర్మాణ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది
-మొదటి దశలో 15 లక్షల ఇళ్లలో ఇంధన సామర్ధ్య ఉపకరణాలు
-ఏటా రూ 539. 7 కోట్లు విలువైన 1674 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదాకు అవకాశం
-ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలుతో లబ్దిదారులకు విద్యుత్ పొదుపు , విద్యుత్ బిల్లులలో ఆదా
-ప్రతి పేదవారికి అందమైన సొంత ఇల్లు .. ఇదే ముఖ్యమంత్రి ఆశయం
-జగనన్న కాలనీల నిర్మాణం గృహనిర్మాణ పథకాల చరిత్ర లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది
-ప్రతి ఇంటికి ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్ లైట్లు, ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్లు అందించాలని ప్రభుత్వం యోచన
-అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో జగనన్న కాలనీల నిర్మాణం
-లబ్దిదారులకు అత్యుత్తమ సౌకర్యాలు… పెరగనున్న జీవన ప్రమాణాలు
-ఇప్పటికే ప్రారంభమైన 10. 72 ఇళ్ల నిర్మాణం… : ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం లోని పేదలకు ఇంధన సామర్ధ్య, ఉత్తమ ప్రమాణాలతో కూడిన అత్యుత్తమ ఇళ్ల నిర్మాణం జరగాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి ,  చెరుకువాడ శ్రీ రంగ నాధ రాజు తెలిపారు . ఇందుకు అవసరమైన ప్రత్యేక ప్రణాళిక రూపొందించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. ఆయా గృహాల్లో ఇంధన సామర్థ్యంతో కూడిన స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాలు అమర్చడం ద్వారా విద్యుత్ పొదుపు జరుగుతుందని , జీవన ప్రమాణాలు మెరుగవుతాయని మంత్రి తెలిపారు.
గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ , హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ , నారాయణ్ భరత్ గుప్తా , ఇతర సీనియర్ అధికారులతో జరిగిన టెలీకాన్ఫెరెన్స్ లో మంత్రి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ పథకాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు. ఇందుకోసం ఉత్తమ మౌలిక సదుపాయాలతో కూడిన జగనన్న కాలనీలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తునట్లు ఆయన తెలిపారు. పేదలకు కేవలం ఇల్లు నిర్మించి ఇవ్వటమే కాకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం , దేశం లోని అన్ని రాష్ట్రాలకు అత్యుత్తమ నమూనాగా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు. ఇక పై ఏపీ మోడల్ ను ఇతర రాష్ట్రాలు అనుసరించేలా సదరు గృహాలలో అత్యుత్తమ ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. ఇందుకోసం రాష్ట్ర ఇంధన శాఖ సమన్వయముతో ఇంధన సామర్ధ్య ప్రమాణాల అమలు పై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని ఆయన కోరారు. తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా ఇల్లు లేని పేదలు పడుతున్న అవస్థలను ముఖ్య మంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కళ్లారా చూశారన్నారు. రాష్ట్రం లో పేదలందరు గౌరవంగా, హుందాగా, ఉత్తమ ప్రమాణాలతో జీవించాలనే లక్ష్యంతోనే ఆయన అతి పెద్ద గృహనిర్మాణ పథకం రూపకల్పన చేసారని మంత్రి వివరించారు.
” ప్రతి పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చటమే ముఖ్యమంత్రి లక్ష్యం . జగనన్న కాలనీలలో ప్రతి పేదవారికి ఉత్తమ ప్రమాణాలతో కూడిన సొంత ఇల్లు ఏర్పాటు అవుతుంది. అందులో భాగంగా రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ , ఇంటర్నెట్ , విద్యుదీకరణ , తాగు నీరు, పాఠశాలలు , ఫంక్షన్ హాళ్లు ,ఆస్పత్రులు తదితర అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. తద్వారా దేశంలో అమలవుతున్న ఇళ్ల పథకాలలో ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన గృహనిర్మాణ పథకం చిరస్మరణీయంగా నిలిచిపోతుంది” అని ఆయన పేర్కొన్నారు. ఇంధన సామర్ధ్య ప్రమాణాలతో కూడిన విద్యుత్ ఉపకరణాలు అమర్చటం ద్వారా జగనన్న కాలనీలు దేదీప్యంగా వెలగాలని , లబ్దిదారులకు అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందాలని ప్రభుత్వం కోరుకుంటుందని ఆయన పేర్కొన్నారు .
అలాగే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు మంజూరు చేయటం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రలో భారీ ఎత్తున చేపట్టిన గృహ నిర్మాణ పథకం ద్వారా నిర్మాణం రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి ఏర్పడుతుందని , ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు .
మరో వైపు 2070 నాటికి దేశాన్ని కాలుష్య రహితంగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న గృహ నిర్మాణ పథకం దోహదకారి అవుతుందని తెలిపారు. ఈ గృహాలలో అమలు చేస్తున్న ఇంధన సామర్ధ్య ప్రమాణాల వల్ల తక్కువ విద్యుత్ తో ఎక్కువ కాంతి లభిస్తుందన్నారు. తద్వారా విద్యుత్ పొదుపు , కాలుష్య నివారణ జరుగుతుందన్నారు. లబ్దిదారులకు విద్యుత్ బిల్లులు కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉందన్నారు.
గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ గృహ నిర్మాణ పథకం మొదటి దశలో ఈ ఏడాది జూన్ నాటికి 15. 6 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందన్నారు. వీటిలో 10. 72 లక్షల ఇళ్ళ నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైనదని, ఒక్కో ఇంటికి రూ 1.80 లక్షలు మంజూరు చేసిందన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా 10,055 జగనన్న కాలనిల లేఔట్లలో ఈ ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ ఇళ్లలో ఇంధన సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉపకరణాలు అమర్చేందుకు ప్రత్యేక ప్రణాలికను రూపొందించబోతున్నామని తెలిపారు. ఈ ఐదు తారల ఉపకరణాల పంపిణి కార్యక్రమం గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల ఆమోదంతోనే , వారి ఇష్టప్రకారంగానే అమలు చేయటం జరుగుతుంది. ఇది స్వచందమేగాని మెండెటరీ కాదు అని అజయ్ చెప్పారు. లబ్ధిదారుల సమ్మతి తోనే ఆయా గృహాల్లో ఈ ఉపకరణాలను అమర్చటం జరుగుతుందన్నారు.
“ఇందులో భాగంగా ప్రతి ఇంటికి నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ట్యూబ్ లైట్లు, రెండు ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్లు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఇంధన సామర్థ్య ఉపకరణాలతో, ప్రతి ఇంటికి సంవత్సరానికి రూ. 3598/-(మూడు వేల ఐదు వందల తొంబై ఎనిమిది రూపాయలు) విలువగల 1116 యూనిట్ల వార్షిక ఇంధన ఆదా అవుతుందని అంచనా.రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నందున, లబ్ధిదారుల ప్రయోజనం కోసం అందించాల్సిన ఇంధన సామర్థ్య ఉపకరణాల సదుపాయం గురించి గృహనిర్మాణ శాఖ ఇప్పటి నుంచే లబ్ధిదారులకు తెలియజేయడానికి ఇది సరైన సమయం.”, అని అజయ్ జైన్ పేర్కొన్నారు
దీనిలో భాగంగా 15 లక్షల ఇళ్లలో ఈ ఇంధన సామర్ధ్య ఉపకరనాలు అమర్చడం వల్ల ఏడాదికి 1674 మిలియన్ యూనిట్లు విద్యుత్ పొదుపు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు . తద్వారా ఏటా రూ 539. 7 కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉందన్నారు .
జగనన్న కాలనీలలో విద్యుదీకరణ కోసం ప్రభుత్వం రూ 7080 కోట్లు వ్యయం చేయనున్నట్లు అజయ్ జైన్ తెలిపారు . ఆ గృహాలలో తక్కువ వ్యయంతో ఇంధన సామర్ధ్య ప్రమాణాలు అమలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాలికను ఏపీఎస్ఈసిఎం ద్వారా అందచేయాల్సిందిగా రాష్ట్ర ఇంధన శాఖ ను కోరినట్లు ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ , ఎనర్జీ ఎఫిసిఎన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారం కూడా ఏపీఎస్ఈసిఎం తీసుకోనుందని ఆయన తెలిపారు.
జగనన్న కాలనీల్లో ప్రతిపాదిత ఇంధన సామర్థ్య చర్యలపై పూర్తిగా దృష్టి సారించాలని క్షేత్రస్థాయి సిబ్బంది , లబ్ధిదారులను ఇంధన సామర్థ్యం పై చైతన్యపరచాలని హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే , హౌసింగ్ కార్పొరేషన్ ఎం డీ , నారాయణ్ భరత్ గుప్తాను అజయ్ జైన్ ఆదేశించారు.
అలాగే ఎనర్జీ ఎఫిసిఎన్సీ డిజైన్ల తో కూడిన ఇళ్ల నిర్మాణము చేపట్టేందుకు ఎకో నివాస్ సంహిత కోడు (రెసిడెన్షియల్ ఈ సి బీ సి )పై మొదటి దశలో 650 మంది విలేజ్ సెక్రటేరియేట్ , వార్డ్ సెక్రటేరియట్ ఉద్యోగులకు రాష్ట్ర ఇంధన శాఖ శిక్షణ ఇవ్వనుంది. ఇలా నిర్మించిన ఇళ్లలో సాధారణ ఇళ్లతో పోలిస్తే లోపల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం , గాలి, వెలుతురు ధారాళంగా రావటం, విద్యుత్ ఆదా కావటం, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడటం వంటి ప్రయోజనాలు ఉంటాయి.
నూతన సంవత్సర సందర్భంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీ రంగ నాథ రాజు , ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ జగనన్న కాలనీ లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలియచేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *