-రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మూడో విడత జగనన్న విద్యా కానుకను విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని ఆయన చాంబరులో పాఠశాలవిద్య, సమగ్రశిక్షా, ఎ.పి.రెషిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఎ.పి.ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్,, ప్రభుత్వ పరీక్షల విభాగం, ఎస్.సి.ఇ.ఆర్.టి. తదితర శాఖ అధికారులతో మంత్రి సమావేశమై శాఖల వారీగా నిర్వహిస్తున్న పనుల ప్రగతిని సమీక్షించారు. వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయనున్న జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన తదితర పధకాల అమలుకు అధికారులు తీసుకుంటున్న చర్యలను మంత్రి అడిగి తెలిసుకున్నారు. నాడు-నేడు పథకం క్రింద ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల మెరుగు, క్రీడా ప్రాంగణాల అభివృద్ది, అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణానికై మొదటి, రెండో దశల్లో అమలు చేస్తున్న పనుల ప్రగతిపై మంత్రి ఆరాతీశారు. విద్యా సంస్కరణల్లో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పౌండేషన్ స్కూళ్ల విద్యా విధానం అమలుకై ప్రభుత్వ పాఠశాలు, టీచర్ల మ్యాపింగ్ పనుల ప్రగతిని మంత్రి సమీక్షించారు. ఫౌండేషనల్ మరియు హైస్కూళ్ల లో అవసరం మేరకు ప్రభుత్వ ఉపాద్యాయులు, ఎయిడెడ్ టీచర్ల కేటాయింపు పనుల ప్రగతిని సమీక్షించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగానున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి 10 వ తరగతి వరకూ చదువుకునే విద్యార్థులందరికీ అవసరమైన సామాగ్రిని ఉచితంగా అందజేసే జగనన్న విద్యా కానుక కిట్లను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులు అందరికీ అందజేసేందుకు సిద్దం చేయాలన్నారు. అందుకు అవసరమైన టెండర్ల ఖరారు ప్రక్రియను సాద్యమైనంత త్వరగా పూర్తిచేసి సంబందిత ఏజన్సీలతో సకాలంలో ఒప్పందాలు పూర్తిచేసుకుని వర్కుఆర్డర్లను జారీచేయాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఆయా కిట్లను ఆన్ని పాఠశాలలకు అందజేసి పంపిణీకి సిద్దం చేయాలన్నారు.
వచ్చే విద్యా సంవత్సరంలో జగనన్న విద్యా కానుకతో పాటే జగనన్న అమ్మఒడి పథకాన్ని కూడా విజయవంతంగా అమలు చేసేందుకు ఒకటి నుండి 12 వ తరగతి వరకు చదువుకునే అర్హులైన విద్యార్థుల జాబితాను సిద్దం చేయాలన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన పథకం క్రింద ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. సంబందిత అర్హుల జాబితాను కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే సిద్దంచేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్ సురేష్ కుమార్, మద్యాహ్న భోజన పథకం సంచాలకులు దీవాన్, సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి, ఎ.పి.రెషిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి కల్నల్ రాములు, ఎ.పి.ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దీవాన్ రెడ్డి, ఎస్.సి.ఇ.ఆర్.టి. సంచాలకులు ప్రతాప్ రెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానంద్ రెడ్డి, ప్రభుత్వ ఇన్ప్రా సలహాదారులు కె.మురళి, మద్యాహ్న భోజన పథకం అదనపు సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ కాలేబ్, ఎ.పి.ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ నాగరాజు తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.