-రూ. 51.64 లక్షల నిధులతో పైప్ లైన్లు ఏర్పాటుకు భూమి పూజలు
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 58వ డివిజన్ పరిధిలోని నందమూరి నగర్ నందలి ప్రజలకు అందించు రక్షిత మంచినీటి సరఫరా మేరుగుదలకై రూ. 51.64 లక్షల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో చేపట్టిన త్రాగునీటి పైప్ లైన్ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమములో సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ మరియు స్థానిక కార్పొరేటర్ అవుతు శ్రీశైలజ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్ మాట్లాడుతూ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో తాము పనిచేస్తున్నమని అన్నారు. డివిజన్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ. 51.64 లక్షలతో పైపు లైన్లకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. పనులు త్వరితగతిన పూర్తిచేసి తాగునీటిని అందిస్తామని తెలిపారు. ప్రజావసరాలను గుర్తించి వారి సౌకర్యాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దీర్ఘ కాలంగా ఉన్న సమస్యలను సైతం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు, రోడ్ల నిర్మాణాలు, ఆరోగ్యకేంద్రాలు, పోలీస్ స్టేషన్లు, కమ్యూనిటీ హాల్స్, ఆర్.వో.బీ, ఆర్.యూ.బీ. నిర్మాణ పనులే ఇందుకు నిదర్శనమన్నారు. నియోజకవర్గంలో అన్ని మారుమూల ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా.. శివారు కాలనీలన్నింటికీ మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 58వ డివిజన్ పరిధిలో సుమారు 2100 మందికి ప్రయోజనం కలిగే విధంగా నందమూరి నగర్ పరిధిలోని భారతమాత గుడి రోడ్ లో ఉత్తరం వైపు క్రాస్ రోడ్డుకు రూ. 9.91 లక్షల అంచనాలతో మంచినీటి సరఫరా పైప్ లైన్ వేయుటకు, రూ. 9.82 లక్షలతో గ్యాస్ గౌడౌన్ వైపు క్రాస్ రోడ్డుకు మంచినీటి సరఫరా పైప్ లైన్లు వేయుటకు, రూ. 18.72 లక్షలు సన్ సిటి కాలనీ ప్రాంతములో మంచినీటి సరఫరా పైప్ లైన్లు వేయుటకు మరియు రూ. 13.19 లక్షల అంచనాలతో ఆర్ అండ్ బి కాలనీ లో మంచినీటి సరఫరా పైప్ లైన్లు పనులు ప్రారంభించుట జరిగిందని వివరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విజయవాడ నగరం ప్రగతి పథంలో దూసుకెళుతోందన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రగతికి గౌరవ శాసనసభ్యులు మల్లాది విష్ణు అందిస్తున్న విశేష సేవలను కొనియాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కార్పొరేటర్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే.. ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తున్నారని చెప్పుకొచ్చారు.
58 డివిజన్ కు సంబంధించి గడిచిన రెండున్నరేళ్ళలో రూ. 15.04 కోట్ల విలువైన పనులు మంజూరైనట్లు మల్లాది విష్ణు గారు తెలిపారు. ఇందులో రూ. 4 కోట్ల పనులు పూర్తి కాగా.. రూ. 11 కోట్ల పనులు వివిధ దశలలో ఉన్నట్లు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ వెల్లడించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, స్థానికులు మరియు వై.ఎస్.ఆర్.పి శ్రేణులు పాల్గొన్నారు.