స్వచ్ఛ సంకల్పానికి ప్రజలందరూ కలిసి రావాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
-క్లీన్ ఆంధ్రప్రదేశ్ – స్వచ్ఛ విజయవాడనే లక్ష్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదంగా గడపాలన్నదే క్లీన్ ఆంధ్రప్రదేశ్(క్లాప్) కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. క్లాప్‌ కార్యక్రమంలో భాగంగా 31వ డివిజన్ పసుపుతోటలో 3 రకాల చెత్త డబ్బాలను స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం తో కలిసి ఇంటింటికీ ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్ లో పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అనంతరం తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర వ్యర్థ పదార్ధాలను వేర్వేరుగా సేకరించవలసిన ఆవశ్యకతపై గృహ యజమానులకు వివరించారు. ఇంట్లో నుంచి మురుగునీరు రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్లాప్ కార్యక్రమం క్రింద కేటాయించిన వాహనాలను సద్వినియోగపరచుకుంటూ.. నగర పరిశుభ్రతకు ప్రజలందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించాలని.. దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాలు, నీరు నిలిచే ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. సైడ్ డ్రెయిన్లలో ఎప్పటిప్పుడు పూడిక తీయవలసిందిగా ఆదేశించారు. ఇంటి నుంచి చెత్త సేకరణ, సెగ్రిగేషన్ పై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు.

అనంతరం ఎమ్మెల్యే  మీడియాతో మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన స్వచ్ఛ సంకల్పం నూరు శాతం సాఫల్యత ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. నగరంలో ప్రతిరోజు 500 టన్నులకు పైగా చెత్త బయటకు వస్తుందని.. ఇటువంటి పరిస్థితుల్లో పర్యావరణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చెత్త తరలింపు కోసం ప్రతి డివిజన్ కు 2 నుంచి 3 వాహనాలు కేటాయించినట్లు వెల్లడించారు. నేరుగా ఇంటి దగ్గరే తడి, పొడి, హానికర చెత్తను వేరుచేసి సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకుంటేనే నగరం మరింత సుందరీకరణ దిశగా అడుగులు వేస్తుందన్నారు. స్వచ్ఛతలో నగరపాలక సంస్థ అనుసరిస్తున్న విధానాలను క్షేత్రస్థాయిలో పర్యటించి గమనించిన కేంద్ర ప్రభుత్వం విజయవాడను స్వచ్ఛ సర్వేక్షణ్ -2021 అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 4,320 నగరాలు ఈ అవార్డు కోసం పోటీ పడగా.. విజయవాడ మూడో స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణమన్నారు. రాబోయే రోజుల్లో విజయవాడ నగరాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు మానం వెంకటేశ్వరరావు, కల్వకొల్లు వెంకటేశ్వరరావు, జనార్థన్, బెజ్జం రవి, వైసీపీ శ్రేణులు, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *