– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పిఆర్సి ప్రకటన అటు నిరుద్యోగులను, ఇటు ఉద్యోగులను నిరాశపరిచిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ముఖ్యమంత్రి ప్రకటించడంతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసే లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు అడియాసలయ్యాయి. వైసిసి అధికారంలోకొచ్చాక ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని జగన్మోహనరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. అధికారంలోకొచ్చిన రెండేళ్ల తదుపరి జాబ్స్ క్యాలెండర్ విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ఇది నిరుద్యోగులకు ఇచ్చిన హామీని జగన్మోహనరెడ్డి తుంగలో తొక్కడమే. ఉద్యోగులు అడిగిన దానికంటే చాలా తక్కువగా ఫిట్మెంట్ను 23 శాతంగా సిఎం ప్రకటించారు. గత ప్రభుత్వం ఇంటీరియమ్ రిలీఫ్ 20 % ఇవ్వగా, జగన్మోహనరెడ్డి అధికారంలోకొచ్చాక 27 % కు పెంచి అమలు చేశారు. ఇప్పుడు ఇంటీరియమ్ రిలీఫ్ కంటే తక్కువగా ఫిట్మెంట్ను 23 % మాత్రమే ప్రకటించారు. ఇతర ఉద్యోగ సమస్యలపై టైంలైన్ విధించారు. గతంలో ఎన్నడూ ఇంటీరియమ్ రిలీఫ్ కంటే ఫిట్మెంట్ తక్కువగా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇది ఉద్యోగులను తీవ్రంగా నిరాశపరడమే. మొత్తంమీద ఉద్యోగులను ముప్పతిప్పలు పెట్టిన మీదట జగన్మోహనరెడ్డి పిఆర్సిని మసిపూసి మారేడుకాయ అన్నట్లుగా ప్రకటించారు. సిఎం ప్రకటనతో అటు నిరుద్యోగులు, ఇటు ఉద్యోగులు నిరాశకు గురయ్యారన్నారు.