-విజయవాడలో ప్రభుత్వడెంటల్ కాలేజీ ఘటనపై ఆరా..
-కీచక అసోసియేట్ ప్రొఫెసర్లపై చర్యలకు ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దంత వైద్యవృత్తిలో విద్యార్థినులకు నైపుణ్యాలను నేర్పాల్సిన వైద్యులే కీచకులుగా మారడంపై రాష్ర్ట మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడలో ప్రభుత్వ దంతవైద్య కళాశాల విద్యార్ధినులను ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు లైంగికంగా వేధించడం పై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ఆమె కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యుగంధర్ తో మాట్లాడారు. వైద్య విద్యార్థినుల ఫిర్యాదులు, వాటిపై ఇప్పటివరకు జరిగిన విచారణ నివేదికను పంపాల్సిందిగా ఆదేశించారు. ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో ఇప్పటి వరకు ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ ఏర్పాటు చేయకపోవడాన్ని ఆమె ప్రశ్నించారు. లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోష్) ప్రకారం ప్రతి శాఖలో ఒక అంతర్గత ఫిర్యాదుల కమిటీని నియమించాలని, పనిచేసే చోట మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టాన్ని తీసుకు వచ్చారని చెప్పారు. దంతవైద్య కళాశాలలో సత్వరమే అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)ని ఏర్పాటు చేసి మహిళా కమిషన్ కు సమాచారమివ్వాల న్నారు. ప్రస్తుతం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్‌లపై గతంలోనూ ఫిర్యాదులున్నప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. తక్షణమే అలాంటి కీచక ప్రొఫెసర్లపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ ప్రభుత్వ దంత వైద్యకళాశాల ప్రిన్సిపాల్, డీఎంఈకు మహిళా కమిషన్ నుంచి అధికారికంగా లేఖను పంపారు.