-శివారు కాలనీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
-వై.వి.రావు ఎస్టేట్ లో వీధి దీపాలకు విద్యుత్ సరఫరా ప్రారంభించిన శాసనసభ్యులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర అభివృద్ధిపై తెలుగుదేశం నాయకులకు మాట్లాడే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58వ డివిజన్ వై.వి.రావు ఎస్టేట్ లో రూ. 3 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన వీధి దీపాలను నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గత చంద్రబాబు ఐదేళ్ల పాలన శంకుస్థాపనలకే పరిమితమైందని విమర్శించారు. చివరకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంజూరై పనులు పూర్తి చేసుకున్న ఇన్నర్ రింగ్ రోడ్డును కూడా తాము చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మరలా రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక నగరాన్ని అన్ని హంగులతో అభివృద్ధి పరచి, ప్రజలకు పూర్తి స్థాయిలో వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో నగరంలోని శివారు కాలనీల వరకు అన్ని మౌలిక సదుపాయాలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. గత తెలుగుదేశం హయాంలో శివారు కాలనీలు అభివృద్ధికి నోచుకోలేదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నగరాన్ని మరింత విస్తరించాలనే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సన్ సిటీ కాలనీ, తోటవారి వీధి, వై.వి.రావు ఎస్టేట్ వంటి నూతనంగా రూపుదిద్దుకుంటున్న కాలనీలలో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. గడిచిన రెండున్నరేళ్ళలో 58వ డివిజన్‌లో రూ. 15.04 కోట్ల విలువైన పనులు మంజూరైనట్లు తెలిపారు. వీటితో పాటు నానాటికి పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం రూ. 3 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకును కూడా నిర్మించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డీఈలు గురునాథం, ఫణి, నాయకులు అవుతు శ్రీనివాస్ రెడ్డి, బంకా భాస్కర్, రాజు, కాలనీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, సెక్రటరీ విజయ సారథి, తదితరులు పాల్గొన్నారు.