-నియోజకవర్గంలోని పలు కీలక అంశాలపై సుధీర్ఘంగా సాగిన చర్చ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ ను విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించి పలు అపరిష్కృత సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మధురానగర్ ఇందిరాకాలనీ, నందమూరినగర్ ఆర్ అండ్ బి కాలనీ, అంబేద్కర్ కాలనీలకు సంబంధించి రెవెన్యూ, మునిసిపల్, ఇరిగేషన్ స్థలాల రెగ్యులరైజేషన్ పై నెలరోజుల్లోగా సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు కోరారు. జీవో నెం.225 భారం లేకుండా చూడాలని విన్నవించారు. అలాగే కొండపావులూరు, సూరంపల్లి లేఅవుట్లను త్వరితగతిన ప్రారంభించాలని విన్నవించారు. నున్న సబ్ రిజిస్ట్రార్, గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలలో గల 22 – A(1) d లో ఉన్న సర్వే నెంబర్లను తొలగించి.. స్థల యజమానులకు రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కల్పించవలసిందిగా కోరారు. ఈ మేరకు కలెక్టర్ కి వినతిపత్రం అందజేయగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు.