-బస్సులో కోవిడ్ నిబంధనలు తప్పనిసరి….
-ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించండి….
-బస్సు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ తప్పనిసరి….
-ప్రయాణికుల నుండి పిర్యాధులు వస్తే చర్యలు తప్పవు…
-జిల్లా కలెక్టర్ జె. నివాస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతి పండుగలలో దూరప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులనుండి అధిక ధరలు వసూలు చేయకుండా ప్రయాణికులకు భారం కాకుండా సహకరించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ప్రైవేట్ బస్సు ట్రావెల్ ఏజెంట్లను కోరారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు ట్రావెల్ బస్ ఆపరేటర్లు, అధిక ధరలను వసూలు చేయకుండా, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా చేపట్టవలసిన కార్యాచరణపై మంగళవారం నగరంలోని జలవనరుల శాఖ రైతు శిక్షణ కేంద్రంలో కలెక్టర్ జె. నివాస్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆపరేటర్లు, రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రద్దీని చూపి ప్రైవేట్ బస్సు ట్రావెల్ ఆపరేటర్లు అధిక ధరలు వసూలు చేస్తున్నారని ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా ఈ నెల 12,13 తేదిలు, తిరిగి 16,17 తేదీల్లో ప్రయాణికుల రాకపోకలు అధిక సంఖ్యలో ఉంటాయన్నారు. కోవిడ్ నేపథ్యంలో పండుగ రద్దీని సాకుగా చూపి అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. అనుమతిలేని, కండిషన్లో లేని వాహనాలు నడపినా, ఎక్కువ చార్జీలు వసూలు చేసినా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. ఏసీ బస్సులో ప్రయాణించేందుకు బుక్ చేసుకున్న ప్రయాణికులకు నాన్ ఏసీ బస్సులు నడపినా, సరైన పమయానికి బస్సులు నడపక పోయినట్లు ప్రయాణికుల నుండి పిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడం జరుగు తుందని కలెక్టర్ అన్నారు. బస్సులలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా చూడాలని, శానిటైజర్ అందుబాటులో ఉంచాలని కలెక్టర్ బస్సు ట్రావెల్ ఆపరేటర్లను కోరారు. బస్సులు కండిషన్లో ఉండాలని, డ్రైవర్లకు ముందుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించాలని, ప్రతీ బస్సులోనూ అదనపు డ్రైవర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రయాణంలో బస్సులను ఆపే పాయింట్స్ ముందుగా తెలపాలన్నారు. మార్గమధ్యలో ప్రయాణికులు కాలకృత్యాలు తీసుకునేందుకు శుభ్రంగా ఉండే టాయిలెట్లు, హైజనిక్ ఫుడ్ ఉండే రెస్టారెంట్లు, ఎంపిక చేసుకోవాలన్నారు. నిర్థేశించిన పాయింట్లలో కాకుండా ఇష్టమొచ్చిన రీతిలో బస్సులను ఆపి ప్రయాణఙకులకు ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రయాణికుల నుండి అధిక ధరలు వసూలు చేసి దోపిడి చేస్తున్నారని ప్రజల నుండి విమర్శలు రానీయ రాదని ప్రైవేటు ఆపరేటర్లను ఆయన కోరారు. ఇప్పటికే కోవిడ్ వల్ల అందరూ అనేక ఇబ్బందులు పడ్డారని, అధిక ధరలు వసూలు చేసి ప్రయాణికులను మరింత ఇబ్బందులకు గరి చేయకూడదని కలెక్టర్ జె. నివాస్ ప్రైవేట్ ట్రావెల్ బస్ ఆపరేటర్లను కోరారు.
డిప్యూటి ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ ఎం. పునేంద్ర మాట్లాడుతూ రవాణా శాఖ తరపున ఎన్ ఫోర్స్ మెంట్ టిమ్స్ ఏర్పాటు చేసి ప్రధాన కూడళ్లు అయిన పాట్టిపాడు టోల్ ప్లాజా, కీసర టోల్ ప్లాజా, వారధి, గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద ప్రయాణికుల నుండి అధిక ధరలు వసూలు, సరుకులు, వస్తువుల రవాణా నిబంధనలు ఉల్లంఘించే బస్సులపై గట్టి నిఘా ఉంచి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ నిర్ణయించిన చార్జీలను మించకుండా ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు వసూలు చేసేలాగా, రెడ్‌బస్, అభిబస్, యాప్‌లను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని డిటిసి తెలిపారు.
ఈ సమావేశంలో ముఖ్యమైన ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల నుండి విజయవాడ నుండి వివిధ దూరాలకు ఆసంస్ధ ద్వారా నడుపుతున్న బస్సులు, వసూలు చేస్తున్న చార్జీలు, బస్సులలో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, బస్సులను ఆపే స్టాపింగ్ పాయింట్లను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతుందని 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారు 15 నుండి 18 సంవత్సరాలు వయసు కలిగిన టీనేజర్స్‌కు వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రైవేట్ బస్ ఆపరేటర్లు, బస్సు డ్రైవర్లు సిబ్బంది కోరినట్లుయితే వారు ఉండే చోటే వ్యాక్సినేషన్ చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో రవాణా శాఖ అధికారులు, ప్రైవేట్ అపరేటర్లు పాల్గొన్నారు.