-తక్షణమే 100 బెడ్స్ తో అందుబాటు లోకి తీసుకురండి…
-వెల్కమ్ కిట్, మెడికల్ కిట్ అందించండి…
-కోవిడ్ కేర్ సెంటర్ల ఇన్చార్జిలుగా నోడల్ ఆఫీసర్లు…
-కలెక్టర్ జె నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు తక్షణమే పూర్తిచేసి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు, సదుపాయాలు, మౌలిక వసతులు తదితర అంశాలపై గురువారం జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆర్డీవోలు, సబ్ కలెక్టర్, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో నగరంలోని క్యాంప్ కార్యాలయం నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా ప్రతి నియోజకవర్గంలోనూ తక్షణమే 100 బెడ్స్ తో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు పూర్తిచేసి అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసరమైతే 200 మందికి కూడా వైద్య సేవలు అందించేందుకు వీలుగా 200 బెడ్స్ తో సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఇందుకు అవసరమైన బెడ్స్, బెడ్ షీట్స్, వెల్కమ్ కిట్, మెడికల్ కిట్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రతీ వెల్కమ్ కిట్ లో బకెట్, మగ్గు, బ్రష్, సోప్, వాటర్ బాటిల్స్ ఉండాలన్నారు. మెడికల్ కిట్ లో విటమిన్ టాబ్లెట్లు, యాంటీ బయాటిక్ మందులు, పారాసిటమాల్ ఉంచాలని, అన్ని కోవిడ్ కేర్ సెంటర్లలో పది చొప్పున ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ అత్యవసర ఇంజక్షన్లను సిద్ధంగా ఉంచాలన్నారు.కోవిడ్ కేర్ సెంటర్లలో వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా డ్యూటీలు కేటాయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ కేర్ సెంటర్లలో టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండాలని, శానిటేషన్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మూడు షిఫ్ట్ లలో శానిటేషన్ సిబ్బంది ఉండేలా మున్సిపల్ కమిషనర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. కేర్ సెంటర్లలో విధులు నిర్వర్తించే శానిటేషన్ సిబ్బందికి పిపిఇ కిట్లు అందించాలన్నారు.కోవిడ్ కేర్ సెంటర్లలో లైట్లు ఫ్యాన్లు ఉండాలన్నారు. కేర్ సెంటర్ల ఏర్పాట్లకు తక్షణమే లక్ష రూపాయల చొప్పున అత్యవసరంగా నిధులను మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్లలో రోగులకు అందించే భోజనాన్ని సరఫరా చేసేందుకు వీలుగా కాంట్రాక్టర్లతో మాట్లాడి సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతీ కోవిడ్ కేర్ సెంటర్ కు నోడల్ అధికారిని నియమించి పర్యవేక్షించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్ ను కలెక్టర్ ఆదేశించారు. రెవిన్యూ డివిజనల్ అధికారులు తమ పరిధిలోని నియోజకవర్గాల్లో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాట్లను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.కోవిడ్ కేర్ సెంటర్లలో తమకు వైద్యం అందలేదని, తమను సరిగా చూడలేదని ఫిర్యాదులు రానీయకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లతో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్ లో అన్ని నియోజకవర్గాల్లోని ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, వైద్య ఆరోగ్య శాఖాధికారులతో మాట్లాడి కోవిడ్ కేర్ సెంటర్లలో చేసిన ఏర్పాట్లను, సదుపాయాలను కలెక్టర్ సమీక్షించారు.