-రానున్న 25 ఏళ్ల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ను కొనసాగించటమే ప్రభుత్వ లక్ష్యం
-వ్యవసాయానికి ఏటా దాదాపు12000 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా
-ఇందుకోసం దాదాపు రూ 8400 కోట్లు సబ్సిడీ అందచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
-వ్యవసాయ అవసరాల కోసమే సెకి నుంచి విద్యుత్ కొనుగోలు ప్రతిపాదన
– సెకి నుంచి విద్యుత్ కొనుగోలు ద్వారా యూనిట్ కు 1. 90 పైసలు తగ్గనున్న వ్యయం
-ఏడాదికి దాదాపు రూ 3230 కోట్లు ఆదా అయ్యే అవకాశం
– ఉచిత విధ్యుత్ పథకంతో అన్నదాతలకు తిరుగులేని భరోసా .. ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి
-రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి నమ్మకం.. మంత్రి
-ఉచిత విద్యుత్ పథకంతో పెరగనున్న వ్యవసాయ ఉత్పాదకత , మెరుగుపడుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ
-ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాం – ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి
-రైతులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఇంధన శాఖ మంత్రి, ఇంధన శాఖ కార్యదర్శి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసే దిశగా ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది . ఇందులో భాగంగా రానున్న 25 ఏళ్ల పాటు రైతాంగానికి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు కీలక చర్యలు చేపడుతుంది. ఈ పథకం బలోపేతం చేయడం ద్వారా వ్యవసాయం పై అన్నదాతల్లో తిరుగులేని భరోసా కల్పించాలని , సాగుబడిని లాభసాటిగా మార్చాలని భావిస్తుంది. తద్వారా రైతు సాధికారికత సాధించే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది.
వై ఎస్ ఆర్ 9 గంటల ఉచిత విద్యుత్ పథకం దేశానికే ఆదర్శవంతంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని విద్యుత్ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. ఉచిత విద్యుత్ కోసం ఒక శాశ్వతమైన, సుస్థిరమైన వ్యవస్థను నెలకొల్పాలని ఆదేశించింది. రాష్ట్రంలో సుమారు 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఏటా దాదాపు 12000 మిలియన్ యూనిట్లు ఉచిత విద్యుత్ ను సరఫరా జరుగుతోంది . ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ 8400 కోట్లు వ్యయం చేస్తోంది. అంతేగాక పగటిపూటే 9 గంటల పాటు 3- ఫేజ్ విద్యుత్ సరఫరా జరిగే వీలుగా 6663 వ్యవసాయ ఫీడర్లను మెరుగుపరిచింది. ఇందుకోసం దాదాపు రూ 1700 కోట్లు వ్యయం చేసింది . తద్వారా విద్యుత్ సరఫరా లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నివారించడమే ప్రభుత్వ లక్ష్యం.
మరో వైపు ఇలా ఉచితంగా సరఫరా చేసే విద్యుత్ ను, ప్రభుత్వం రూ 4.36/- చొప్పున కొనుగోలు చేస్తోంది. ఈ పథకాన్ని రానున్న 25 ఏళ్ల పాటు కొనసాగించాల్సిన దృష్ట్యా విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడం పై రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగా సౌర విద్యుత్ ను సమకూర్చుకోవడం ద్వారా ఉచిత విద్యుత్ పై కొంత మేర వ్యయాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కర్పోరేషన్ అఫ్ ఇండియా (సెకి ) సౌర విద్యుత్ యూనిట్ కు రూ 2.49/- కే సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది . రాష్ట్రానికి మూడు దశల్లో మొత్తం 9000 మెగావాట్ల విద్యుత్ ను సరఫరా చేసేందుకు ప్రతిపాదించింది.
సెకి సంస్థ సౌర విద్యుత్ ను పగటి పూటే సరఫరా చేసే దృష్ట్యా, సదరు విద్యుత్ ను వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం వినియోగించాలని భావిస్తున్నారు . ప్రస్తుతం డిస్కాములు కొనుగోలు చేస్తున్న విద్యుత్ ధర ( యూనిట్ కు రూ 4. 39/- ) తో పోలిస్తే సెకి ఆఫర్ చేసే ధర తక్కువగా ఉన్న దృష్ట్యా ఒక యూనిట్ కు రూ 1. 90/- వ్యయం తగ్గుతుంది . తద్వారా ఏడాదికి విద్యుత్ సంస్థలకు దాదాపు రూ 3230 కోట్లు ఆదా అవుతుందని ఏ పీ ట్రాన్స్కో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా స్థితి, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా గురించి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష లో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ .. ఉచిత విద్యుత్ పథకం వల్ల తమ పంటలను కాపాడుకోగలమనే భరోసా రైతుల్లో కల్పించడమే ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. రైతులకు ఒక తిరుగులేని భరోసా కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది . ఈ పథకం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతు సాధికారికతకు బాటలు వేస్తుందని పేర్కొన్నారు . భవిష్యత్ లోను ఇదే భరోసా కొనసాగేలా ఉచిత విద్యుత్ ను శాశ్వత పథకంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బలంగా విశ్వసిస్తారని మంత్రి తెలిపారు . దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రాధాన్యతలను నిర్ణయించుకున్నదని స్పష్టం చేసారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తో పాటు ఆక్వా రంగానికి సబ్సిడీ ధర మీద విద్యుత్ సరఫరా, సాగునీటి సౌకర్యాలు మెరుగుపరదచడం, రైతు భరోసా కింద అన్నదాతలకు ఆర్థిక సహకారం అందించడం, సున్నా వడ్డీకే వ్యవసాయ రుణాలు ,ఉచిత పంటల భీమా పథకం వంటి ఎన్నో విప్లవాత్మక చర్యలను ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు.
తద్వారా గ్రామీణ ప్రాంతాలు , అక్కడ నివసిస్తున్న ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు . తద్వారా ఈ సంక్రాంతి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఉచిత విద్యుత్ పథకం వ్యవసాయ ఉత్పాదకత పెరిగేందుకు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో రైతులు, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, రైతులకు చేయాల్సింది ఎంతో ఉందని ప్రభుత్వం భావిస్తోందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు . గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి గుర్తుచేశారు.
ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం , విద్యుత్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కార్పొరేషన్ అనే ప్రత్యేక డిస్కామ్ ను ఏర్పాటు చేసిందన్నారు. దీర్ఘ కాలంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాను కొనసాగించే బాధ్యతను ఈ డిస్కాము చేపడుతుందన్నారు . ఈ పథకం విజయవంతం చేసేందుకు లైన్ మెన్ నుంచి చైర్మన్ వరకు విశేష కృషి చేస్తునట్లు తెలిపారు .
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటునందుకు ఇంధన శాఖ కార్యదర్శి మరియు సి ఎం డీ ఏ పీ ట్రాన్స్కో శ్రీకాంత్ నాగులాపల్లి నేతృత్వంలో సమర్థమవంతంగా పని చేస్తున్న డిస్కామ్ సి ఎం డీ లు, హెచ్ హరనాథ రావు, జె పద్మ జనార్ధన రెడ్డి , కె సంతోష రావు , విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు , యావత్తు విద్యుత్ వ్యవస్థ యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు
సంక్రాంతి పర్వ దిన సందర్భంగా రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులు , విద్యుత్ సంస్థల ఉద్యోగులకు , ఇంధన శాఖ మంత్రి , కార్యదర్శి శుభాకాంక్షలు తెలియచేసారు.