-ఈబీసీ నేస్తం పథకం ప్రారంభోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మహిళా సాధికారత సీఎం జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమవుతోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఈబీసీ నేస్తం పథకం ప్రారంభోత్సవ అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటును అందిస్తున్నట్లు వివరించారు. ఈబీసీ నేస్తం, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ రుణాల వంటి పథకాలతో నిజమైన మహిళా సాధికారితకు ప్రభుత్వం దారులు పరుస్తోందన్నారు. చంద్రబాబు అక్కచెల్లెమ్మలను నమ్మించి మోసం చేస్తే.. సీఎం జగన్ అడుగడుగునా అండగా నిలిచారన్నారు. మహిళలకు సుస్థిర జీవనోపాధి అవకాశాలను అందుబాటులోకి తెచ్చే విధంగా మల్టీ నేషనల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం జరిగిందన్నారు. పారిశ్రామిక రంగంలో మహిళల సంఖ్య పెంచాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ప్రాతినిధ్యం కల్పించడం మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. గత ప్రభుత్వం మహిళలను మరీ ముఖ్యంగా అగ్రవర్ణ పేదలను పట్టించుకోలేదని మల్లాది విష్ణు మండిపడ్డారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు పూర్తి తోడ్పాటును అందిస్తోందని తెలిపారు. ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి జిల్లాలో 30,913 మంది మహిళలు అర్హత సాధించగా.. విజయవాడ నగరంలో 5 వేల మంది ఉన్నట్లు వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 2 వేల మందికి ఈ పథకం ద్వారా దాదాపు రూ. 3 కోట్ల లబ్ధి చేకూరుతోందన్నారు. మహిళలందరూ ఈ నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగపరచుకుని అన్ని రంగాల్లో రాణించాలని.. ప్రతి మహిళ నలుగురికి ఉపాధి కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.