-తుది ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించే అలంకృత శకటాల తుది ఏర్పాట్లను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో మంగళవారం సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. వేడుకలలో వివిధ శాఖలకు చెందిన 16 శకటాల ప్రదర్శన ఉంటుందన్నారు.
రైతు భరోసా పై వ్యవసాయ శాఖ శకటం, జగనన్న పాలవెల్లువపై పశుసంవర్ధక శాఖ శకటం, మత్స్యకార భరోసా, ఆక్వా లాబ్,ఆక్వాహబ్ లపై మత్స్య శాఖ శకటం, అమ్మ ఒడి,నాడు -నేడు పై విద్యా శాఖ శకటం, విద్యా దీవెన, వసతి దీవెనపై సాంఘిక సంక్షేమ శాఖ శకటం, ఆరోగ్యశ్రీ, నాడు నేడు, కోవిడ్ పై వైద్య ఆరోగ్య శాఖ శకటాలు, సంపూర్ణ భూహక్కుపై గృహ నిర్మాణ శాఖ శకటం, అంగన్వాడీ, ప్రీ స్కూల్స్ పై మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ శకటం, వైయస్సార్ పెన్షన్ కానుక, వైఎస్ ఆర్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకాలపై సెర్ఫ్ శకటం, ఏపీఐఐసీ , వైయస్సార్ వన్, ఎమ్ఎస్ ఎంఈ లపై పరిశ్రమల శాఖ శకటం, స్వచ్ఛ ఆంధ్ర, క్లీన్ ఆంధ్ర పై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శకటం, జగనన్న పచ్చతోరణం పై అటవీశాఖ శకటం, మారుతున్న మన పల్లె ముఖచిత్రాలు ప్రధానాంశంగా గ్రామ, వార్డు సచివాలయం పై ఏర్పాటుచేసిన ప్రత్యేక శకటం గణతంత్ర వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా ఉంటాయని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి అన్నారు.
పరేడ్, శకటాల పరిశీలనలో శాసనమండలి సభ్యులు,ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కిరణ్ కుమార్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్, శకటాల ఇన్చార్జులు పాల్గొన్నారు.