-రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్యంలో ఓటు శక్తివంతమైన సాధనమని, భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన అమూల్యమైన హక్కు అని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్‌భవన్ నుండి మంగళవారం హైబ్రీడ్ మోడ్‌లో జరిగిన 12వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలకు గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ఇది దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికల భాగస్వామ్యానికి సంబంధించిన వేడుక అని అన్నారు. ‘ఓటరు వదిలివేయబడడు’ అనే నినాదంతో అన్ని వర్గాల ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి భారత ఎన్నికల సంఘం కేంద్రీకృత ప్రచారం ద్వారా చేస్తున్న కృషిని అభినందనీయమన్నారు. ఓటరు నమోదు ప్రక్రియను సులభతరం చేయడానికి, సౌకర్యవంతంగా మలచటానికి భారత ఎన్నికల సంఘం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు.
సామూహిక అవగాహన ప్రచారాల ద్వారా ఎన్నికలలో ఓటర్లు ఎక్కువగా పాల్గొనేలా చూస్తుందని గవర్నర్ అభినందించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి పాత్రను పునరుద్ఘాటిస్తుందన్నారు. ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవడం ద్వారా ఎన్నికలలో స్వయంగా పాల్గొనడం, తమ ప్రతినిధులను ఎన్నుకోవడం కోసం ఓటు హక్కును వినియోగించుకోవడం వంటి అంశాలు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నాయన్నారు. క్రియాత్మక ప్రజాస్వామ్యం కోసం ఎన్నికల సంఘం అత్యద్భుతమైనదని పాత్ర పోషిస్తుందని గవర్నర్ అన్నారు. పాలనా ప్రక్రియకు అంత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియలో ప్రజలు హృదయపూర్వకంగా పాల్గొనడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని, అందువల్ల ఏ ప్రజాస్వామ్య ఎన్నికల్లోనైనా ఓటరు అత్యంత ముఖ్యమని వివరించారు.
భాగస్వామ్య ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు చాలా ముఖ్యమైన ప్రక్రియ కాగా, ఈ హక్కు కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పోరాటాలు చేసారని గవర్నర్ గుర్తు చేసారు. జాతీయ ఓటరు దినోత్సవం రాజ్యాంగంపై మనకున్న విశ్వాసాన్ని, దాని ప్రతిష్టాత్మకమైన విలువల పట్ల కృతజ్ఞతా భావాన్ని పునరుద్ఘాటిస్తుందన్నారు. మన రాజ్యాంగ నిర్మాతలకు మనం ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని, మనమంతా ఓటు శక్తి గురించి తెలుసుకుని, మన ఓటు హక్కును శ్రద్ధగా వినియోగించుకున్నప్పుడే ఆ రుణం తీర్చుకోగలమని గవర్నర్ అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ గౌరవ అతిథిగా పాల్గొనగా, ఎన్నికల ప్రధాన అధికారి కె. విజయానంద్ స్వాగతోపన్యాసం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, గవర్నర్ సంయిక్త కార్యదర్శి ఎ. శ్యామ్ ప్రసాద్, ఉప కార్యదర్శి సన్యాసి రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.