-కాన్వాయ్, గౌరవ వందనంతో పూర్తి స్దాయి రిహార్సల్స్ నిర్వహణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని ఇందిరాగాంధీ నగర పాలక సంస్ధ క్రీడా మైదానంలో జరగనున్న గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా మంగళ వారం పరిశీలించారు. గణతంత్ర దినోత్సవం కోసం క్రీడా మైదానాన్ని ముస్తాబు చేస్తుండగా, బుధవారం నాడు కార్యక్రమాలు నిర్వహించే తీరుగానే మంగళవారం రిహార్సల్స్ చేపట్టారు. జిల్లా కలెక్టర్ నివాస్, నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, రాష్ట్ర ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్య రెడ్డి తదితరులు సిసోడియాకు స్వాగతం పలికారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న శాసన పరిషత్తు సభ్యుడు , ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ తో భేటీ అయ్యారు. పూర్తి స్ధాయి రిహార్సల్స్ లో పాల్గొన్న సిసోడియా అక్కడి అధికారులకు పలు సూచనలు చేసారు. ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని స్పష్టం చేసారు. సిసోడియా వెంబడి గవర్నర్ ఎడిసిలు సాహిల్ మహాజన్, ఈశ్వర రావు ఉన్నారు.