విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దుర్గాపురం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మగాంధీ, పింగళి వెంకయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశ పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజలకు సంక్రమించిన అనేక హక్కులు రాజ్యాంగ ఫలితమే అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని ప్రతిఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశం సమాఖ్య రాష్ట్రాల సమాహారమని, ఈ సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంకణబద్ధులై ఉన్నారన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. వ్యవస్థలను ఏవిధంగా నాశనం చేసిందో ప్రజలందరూ చూశారన్నారు. పౌరుల కనీస ప్రాథమిక హక్కులను కూడా గత ప్రభుత్వం కాలరాసిందని గుర్తుచేశారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడుతూ పాలన సాగిస్తున్నారని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. ప్రజల యొక్క అన్ని హక్కులను రాజ్యాంగపరంగా కాపాడుతున్నారన్నారు. అంబేద్కర్ స్పూర్తితో సమ సమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాల అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్నారన్నారు. అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ చిత్తశుద్ధితో బాధ్యతలు నెరవేరుస్తున్నారని చెప్పారు. రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు అందించడంతో పాటు.. విద్య, వైద్యం, గృహ నిర్మాణం వంటి అనేక సంక్షేమ పథకాలతో ముందుకు వెళుతున్నారన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనతోనే సాధ్యమైందని మల్లాది విష్ణు అన్నారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్ బాలి గోవింద్, వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ శనగశెట్టి హరిబాబు, గుండె సుందర్ పాల్, పోతినేని గాయత్రి, శీలం భవానీరెడ్డి, డాక్టర్ వసంతకుమార్, కూనపురెడ్డి అనిల్, బంకా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …