-మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడిండి. అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తొలుత జాతిపిత మహాత్మ గాంధీజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు గారు ప్రసంగిస్తూ.. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ 73 ఏళ్ల కాలంలో దేశం ఎంతో పురోగతి సాధించిందని.. ఇంకా సాధించాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చారు. గణతంత్ర దినోత్సవం అనేది కులాలకు, మతాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా జరుపుకునే పండుగ అని పేర్కొన్నారు. జాతీయ జెండాను ఎగురవేయడమంటే స్వేచ్చను అనుభవించడమేనని వ్యాఖ్యానించారు. దాదాపు 200 ఏళ్ల పాటు బ్రిటిషర్ల పాలనలో మగ్గిపోయిన భారతావని.. సుదీర్ఘ పోరాటాలు, ఎందరో మహాత్ముల ప్రాణత్యాగాలతో స్వేచ్ఛా వాయువులను పీల్చుకుందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అశువులుబాసిన త్యాగధనులను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ దాస్య శృంఖలాలను తెంచేందుకు పోరాట పటిమను, తెగువను చూపినవారిలో కృష్ణా జిల్లా నాయకులు ముందు వరుసలో నిలిచారని మల్లాది విష్ణు అన్నారు. పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం జాతి సమైక్యతకు, జాతి సమగ్రతకు చిహ్నంగా నిలిచిందన్నారు.
ఎందరో త్యాగధనులు మన దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకొస్తే.. మన జగనన్న ఆయన పాలన ద్వారా ఆ మహనీయుల త్యాగాలకు సరైన నివాళి అర్పిస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. నిజమైన స్వాతంత్య్ర ఫలాలు ప్రజలకు దక్కేలా చూస్తున్నారని చెప్పుకొచ్చారు, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నారన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధనలో భాగంగా గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి.. అనేక సంక్షేమ పథకాలను చిట్టచివరి వ్యక్తి వరకూ అందజేస్తున్నారన్నారు. జిల్లాల పునర్విభజనతో పాలనను మరింత సుగుమం చేసే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సుస్థిర అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా పథకాలు అమలు చేస్తూ.. నవరత్నాలతో నవయుగానికి నాంది పలికిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కోరారు. ఈ వేడుకలలో స్టేడియం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నెమలికంటి భవానీ ప్రసాద్, సెక్రటరీ బొమ్మిశెట్టి రమేష్, ట్రెజరర్ టి.రాఘవరావు, సభ్యులు శ్రీనివాసరాజు, వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.