-గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వర మెరుగైన సేవలందించాలి
-సిబ్బంది రోజూ మధ్యాహ్నం 3నుండి5గం.లవరకూ ప్రజలకు అందుబాటులో ఉండాలి
-త్వరలో గ్రామ వార్డు సచివాలయాల్లోని ఖాళీల భర్తీ
-గ్రామ,వార్డు సచివాలయాల కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే జూన్ నెలాఖరులోగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ను డిక్లేర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోనుందని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు.గురువారం అమరావతి సచివాలయం మూడవ బ్లాకులో గ్రామ,వార్డు వాలంటీర్, గ్రామ,వార్డు సచివాలయాల వ్యవస్థపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ)ధర్మాన కృష్ణ దాస్,మున్సిపల్ శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ,సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు పినిపే విశ్వరూప్, ఇంధన శాఖామాత్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి,పశుసంవర్ధక,మత్స్యశాఖా మాత్యులు సీదిరి అప్పలరాజు,గ్రామ,వార్డు సచివాలయాల సలహాదారు ధనుంజయ రెడ్డి,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్న ఈకోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో గ్రామ,వార్డు వాలంటీర్,గ్రామ,వార్డు సచివాలయాల వ్యవస్థ పనితీరుకు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు.
ఈసందర్భంగా రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ గ్రామ,వార్డు వాలంటీర్ మరియు గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామ,వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నఉద్యోగులకు జూన్ నెలాఖరులోగా ప్రొబేషన్ డిక్లేర్ చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోనుందని చెప్పారు.అదే విధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది రోజూ మధ్యాహ్నం 3నుండి 5గం.ల వరకూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి సంబంధించి ఆయా శాఖలు వారిగా వర్కు సాటిస్పేక్షన్ సర్టిఫికెట్లను తీసుకోవాలని గ్రామ,వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ను మంత్రి రామచంద్రారెడ్డి ఆదేశించారు.
రాష్ట్ర మున్సిపల్ శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా సిటిజన్ సర్వీసెస్ పోర్టల్(ఎపి సేవా పోర్టల్)ను గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు.దీంతో ప్రజలు వివిధ సేవలకై ఏసచివాలయం నుండైనా ధరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు.ఈపోర్టల్ ద్వారా ప్రజలకు అన్ని విధాలా మరిన్ని మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
రాష్ట్ర గ్రామ,వార్డు వాలంటీర్,గ్రామ,వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామాల్లో 11వేల 162, పట్టణాల్లో 3వేల 842 మొత్తం కలిపి 15వేల 04 సచివాలయాలు పనిచేస్తున్నాయని తెలిపారు.గ్రామ సచివాలయాల్లో 11,వార్డు సచివాలయాల్లో 10 ఫంక్షనరీలకు సంబంధించిన సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు.గ్రామ వార్డు సచివాలయాల్లో సుమారు 14వేల 493 ఖాళీలుండగా వాటిని త్వరితగతి భర్తీ చేయాలని సియం ఆదేశించారని త్వరలో భర్తీ ప్రక్రియ చేపడతామని అన్నారు.ఇప్పటి వరకూ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 3కోట్ల 50లక్షల సర్వీసులను ప్రజలకు అందించడం జరిగిందని వివరించారు.
ఇంకా వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య,పోలీస్ నియాకమ సంస్థ అదనపు డిజిపి సంజయ్,ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్,గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే తదితర అధికారులు గ్రామ,వార్డు సచివాలయాల్లో పనిచేసే వారి శాఖలకు సంబంధించిన సిబ్బంది,ఇతర అంశాలపై మాట్లాడారు.ఈసమావేశంలో జిఎస్డబ్ల్యుఎస్ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే,విఎస్డబ్లుఎస్ కమీషనర్ షన్ మోహన్,సెర్ప్ సిఇఓ ఇంతియాజ్ ఇంకా పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.