-ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కేంద్రం పూర్తిగా విస్మరించింది
-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర బడ్జెట్ రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 1వ డివిజన్ పవర్ ఆఫీస్ కట్ట, ఊర్మిళ నగర్ లలో స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటుగా.. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. పలువురు పెన్షన్, బియ్యం కార్డుదారుల సమస్యలపై అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం ఇంటింటికీ తిరిగి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్ ను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ వేగవంతంగా జరుగుతున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు పింఛన్‌దారులకు ఇంటి వద్దకే వెళ్లి డబ్బులు అందజేస్తున్నట్లు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కళ్లు కాయలు కాసేలా పింఛన్ కోసం ఎదురుచూసే పరిస్థితి నుంచి.. నేడు అవ్వాతాతలను వెతుక్కుంటూ ఇంటి గుమ్మం వద్దకే పింఛన్ వస్తోందని తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించి ఈ నెలలో 24,877 మందికి పింఛన్ పంపిణీ చేస్తుండగా.. డివిజన్ లో 1,500 మందికి 2,500 రూపాయలు అందజేస్తున్నట్లు వివరించారు.
విద్యార్థినులకు దిశ యాప్ పై అవగాహన
మహిళలకు అత్యవసర సమయాలలో రక్షణ కల్పించడంలో దిశ యాప్ కీలక పాత్ర పోషిస్తోందని మల్లాది విష్ణు అన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా కాలేజీ విద్యార్థినులకు దిశ యాప్ పై విస్తృత అవగాహన కల్పించారు. యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే విధానాన్ని తెలియజేయడంతో పాటు.. వినియోగించే ప్రక్రియను వివరించారు. ఆపదలో ఉన్నామని సమాచారం ఇచ్చే మహిళలకు.. క్షణాల్లో యాప్ ద్వారా సహాయం అందుతుందని తెలియజేశారు. ఎస్వోఎస్ బటన్ నొక్కిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుంటారని పేర్కొన్నారు. దిశ యాప్ ఉంటే మహిళలు ఎక్కడికి వెళ్లినా అన్నయ్య తోడుగా ఉన్నట్లేనని.. కనుక యువతలంతా తప్పనిసరిగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి మొండిచేయి చూపిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులు కూడా చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు, జాతీయ విద్యా సంస్థల కోసం బడ్జెట్‌లో కనీసం ప్రస్తావించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అంశంపైనా కేంద్రం ముఖం చాటేసిందన్నారు. కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించడం చాలా దుర్మార్గమన్నారు. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని పదేపదే దెబ్బతీస్తున్న బీజేపీకి.. ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నాయకత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కొండా మహేశ్వర్ రెడ్డి, ఆళ్ల ప్రసాద్ రెడ్డి, మండాది వెంకట్రావు, బండి వేణు, యలమంద, కె.రమణి, చంద్రలీల, సువార్త, లక్ష్మి, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.