-ఈనెల 13న అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 5కె రన్
-5కె రన్ పోస్టరును ఆవిష్కరించిన సీపీ కాంతి రాణా
-గుండె ఆరోగ్యంపై అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మీ గుండెను ప్రేమించండి! అనే థీమ్ తో అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వారు వినూత్నమైన కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఫిబ్రవరి మాసాన్ని మంత్ ఆఫ్ లవ్ గా జరుపుకుంటున్న నేపథ్యంలో లవ్ యువర్ హార్ట్ పేరుతో 5కె రన్ నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈనెల 13న జరిగే ఈ 5కె వాక్ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నిర్వహించనున్న 5కె రన్ అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరూ తమ గుండె సంరక్షణపై శ్రద్ధ వహించాలని, వైద్య నిపుణుల సూచనల మేరకు అవసరమైన జాగ్రత్తలను పాటించాలని సూచించారు. హృద్రోగాల బారినపడకుండా ఉండేందుకు తగినంత వ్యాయామం, క్రమబద్ధమైన జీవన విధానాలను అవలంభించాలని సూచించారు. దురలవాట్లకు దూరంగా వుంటూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ గుండెను ప్రేమిస్తూ, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని సీపీ కాంతి రాణా టాటా ఆకాంక్షించారు. 13వ తేదీ ఉదయం గం.7.30లకు బీఆర్టీఎస్ రోడ్డులో జరిగే ఈ 5కె రన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె. నివాస్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ నేత దేవినేని అవినాష్, డీసీపీ డి. మేరీ ప్రశాంతి, అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ జి. రమేష్ తదితరులు అతిధులుగా హాజరవుతారని అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ జి. శ్రీదేవి తెలిపారు. గుండె ఆరోగ్య సంరక్షణపై అవగాహన కోసం నిర్వహిస్తున్న ఈ 5కె రన్ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ శ్రీదేవి కోరారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బిజినెస్ హెడ్ కల్యాణితో పాటు మార్కెటింగ్ హెడ్స్ షకీర్ అహ్మద్, అజీమ్, దినేష్ పాల్గొన్నారు.