-అర్హులైన దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 15న దివ్యాంగ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల ఉపకరణాల ఎంపిక మరియు గుర్తింపు శిబిరం జరగనున్నట్లు వెల్లడించారు. సత్యనారాయణపురం ఎ.కె.టి.పి.ఎం. ఉన్నత పాఠశాల (ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం మున్సిపల్ హై స్కూల్) నందు ఈ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కండరాల బలహీనత, వెన్నెముక దెబ్బతిన్న దివ్యాంగుల కోసం బ్యాటరితో నడిచే మూడు చక్రముల బండ్లు, వీల్ చైర్స్, చంక కర్రలు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు, క్యాలిపర్స్, ఏం.అర్. కిట్లు మొదలగు వాటికి శాచ్యురేషన్ పద్ధతిలో ఎంపిక మరియు గుర్తింపు జరగనుందని చెప్పారు. కనుక అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులు వారి యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సదరన్ సర్టిఫికేట్, 4 ఫోటోలతో శిబిరానికి హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరారు. దివ్యాంగుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు.