-శ్రీ సర్వేశ్వరా నాట్యమండలి 35వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం కళలకు, కళాకారులకి ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గాంధీనగర్లో వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయము నందు టి.రాజబాబు, బాబురాజు ఆధ్వర్యంలో జరిగిన శ్రీ సర్వేశ్వరా నాట్యమండలి 35వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ హార్మోనిస్ట్ చింతలపూడి నాగేశ్వరరావుకి.. యస్.పి కోదండపాణి సంగీత పురస్కారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. తదననంతరం ప్రదర్శింపజేసిన శ్రీ కృష్ణ రాయబారం, సత్యహరిశ్చంద్ర నాటకాలు ప్రేక్షకులను అలరింపజేశాయి. శ్రీకృష్ణుడిగా బాబురాజు, అర్జునుడుగా అగురు త్రినాథ్ నాయుడు, దుర్యోధనునిగా ప్రసాద్ బాబు, సత్యహరిశ్చంద్రునిగా నరసింహరావు, నక్షత్రకునిగా అడపా ప్రభావతి, చంద్రమతిగా విజయలక్ష్మి మెప్పించారు. భారతీయ కళారంగంలో నాటకాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. సమాజంపై ప్రభావం చూపించడంలో నాటకాల పాత్ర కీలకమని చెప్పారు. భాష ఉన్నతికి చిరునామాగా ఉంటూ, ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచే నాటకాలకు పూర్వ వైభవం తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నాటక రంగం సినిమాతో పోటీపడాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళలు, కళాకారులకి ప్రోత్సాహం అందించటంలో ఎప్పుడూ ముందు ఉంటుందని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా పలువురు కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బాలి గోవింద్, శర్వాణీ మూర్తి, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు గోళ్ల నారాయణరావు, పౌరాణిక రంగస్థల కళాకారుల సమాఖ్య విజయవాడ ప్రధాన కార్యదర్శి అగురు త్రినాథ్ నాయుడు, ఆచంట బాలాజీనాయుడు, గుమ్మడి జైరాజ్ కళాపీఠం ప్రధాన కార్యదర్శి గుమ్మడి అన్వేష్, రావి వెంకట్, చింతా వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.