-ఎమ్మెల్యే చేతుల మీదుగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కష్టజీవులకు తోడుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న చేదోడు పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ నగదు విడుదల చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి బుడమేరు మధ్యకట్ట వద్ద పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లు పెనుమత్స శిరీష సత్యం, శర్వాణీ మూర్తితో కలిసి శాసనసభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని అమలుచేస్తూ అన్ని సామాజిక వర్గాల వికాసానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అండగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు దగ్గరనుండి అర్థం చేసుకున్నారని తెలిపారు. నవరత్నాలతో మ్యానిఫెస్టో విడుదల చేసి ఇప్పటివరకు 98 శాతం హామీలను అమలు చేశారన్నారు.
మార్చి 11 వరకు గడువు పెంపు:
వృత్తిదారులను ప్రోత్సహించడం, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని మల్లాది విష్ణు అన్నారు. ఎన్నో కుటుంబాలలో జగనన్న చేదోడు పథకం వెలుగులు నింపిందన్నారు. ముఖ్యంగా మహిళలు పెద్దసంఖ్యలో లబ్ధి పొందడం ఆనందంగా ఉందన్నారు. షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు ప్రతిఒక్కరికీ రూ.10 వేల చొప్పున ఆర్థికసాయాన్ని నేరుగా వాళ్ల బ్యాంక్ అకౌంట్లలోనే జమ చేయడం జరిగిందన్నారు. లంచాలు, సిఫార్సులకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ద్వారా 2,85,350 మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు రూ.285.35 కోట్ల ఆర్థిక సాయం అందగా.. సెంట్రల్ నియోజకవర్గంలో 1,008 మందికి రూ. 1 కోటి 80 వేల రూపాయలు లబ్ధి చేకూరిందని వివరించారు. మొదటి విడతలో నియోజకవర్గంలో 2,021 మందికి రూ. 2.02 కోట్లు అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందజేసిన ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అర్హత ఉండి జగనన్న చేదోడు పథకం అందరి వారు ఎవరైనా ఉంటే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 11 వరకు గడువు ఉందని తెలిపారు. రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంఘాల నేతలు కూడా అర్హులను గుర్తించే దిశగా చొరవ చూపాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు గుండె సుందర్ పాల్, సామంతకూరి దుర్గారావు, పి.ముత్యాలరావు, సత్యనారాయణ, కె.శ్రీనివాసరావు, వేమూరి బ్రహ్మం, భోగాది మురళి, బెజ్జం రవి తదితరులు పాల్గొన్నారు.