-40 కోట్ల రూపాయలు వ్యయంతో కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామం పెదలంక ప్రధాన కాలువ పై రెండు లేన్ల రహదారి వంతెన మరియు ఔట్ ఫ్లో స్లూయాజ్ నిర్మాణం
-పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే జోగి రమేష్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మారుమూల తీరప్రాంత పెడన నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, రాష్ట్ర నిధుల్లో పెడన నియోజకవర్గానికి అంచనాకు మించిన వాటా దక్కుతోందని, కొత్త ప్రాజెక్టులు మరియు ప్రగతికారక ప్రత్యేక పనులు మంజూరు అవుతున్నాయని పెడన శాసనసభ్యులు జోగి రమేష్ ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
కొల్లేరు సరస్సు పరిరక్షణకై గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, కొల్లేరు సరస్సు నుంచి మురుగునీటిని సముద్రంలో కలిపే ఉప్పుటేరు ఆధునీకరణలో భాగంగా 412 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరణ పనులు ప్రారంభించడానికి ముందడుగు వేస్తూ,ఈ ఆధునికీకరణ పనుల్లో పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామం వద్ద పెదలంక ప్రధాన కాలువ పై రెండు లేన్ల రహదారి మరియు వంతెన నిర్మాణం – భారీ తూములు ఏర్పాటు ద్వారా నీరు బయటకు మళ్లింపు [ ఔట్ ఫ్లో స్లూయాజ్ ] పనుల నిమిత్తం 40 కోట్ల రూపాయలు కేటాయిస్తూ పరిపాలన ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా పెడన శాసనసభ్యులు జోగి రమేష్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, నియోజకవర్గ అభివృద్ధి కొరకై తాను చేస్తున్న ప్రతిపాదనలకు వెంటనే అంగీకారాన్ని తెలుపుతూ, మద్దతుగా నిలుస్తూ, నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి నియోజకవర్గ ప్రజలందరి తరుపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
తాను మొదటిసారి పెడన నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సమయంలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి నియోజకవర్గ సమూల అభివృద్ధి కై ఒక అడుగు ముందుకు వేస్తే, నేడు వారి తనయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పది అడుగులు ముందుకు వేస్తూ తీరప్రాంత గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఊతం ఇచ్చేలా పలు ప్రగతి పనుల కొరకై ఇటీవల కొన్ని నెలల వ్యవధిలోనే వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం, పెడన నియోజకవర్గ అభివృద్ధి పట్ల వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనమని జోగి రమేష్ కొనియాడారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి సహృదయంతో అందిస్తున్న తోడ్పాటుతో రానున్న రోజుల్లో కూడా పెడన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపేందుకు తాను శక్తివంచన లేకుండా శాయశక్తులా కృషి చేస్తానని జోగి రమేష్ హామీ ఇచ్చారు.