-2,032 మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు రూ.8.57 కోట్లు విడుదల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు నిర్మాణంలో భాగంగా తాజాగా 2 వేల 032 మంది లబ్ధిదారులకు రూ.8.57 కోట్లు నిధులు విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పేదలందరికీ ఇళ్ళ నిర్మాణంలో భాగంగా వివిధ దశల్లో నిర్మాణాలు పూర్తి చేసుకున్న 2,032 మంది లబ్ధిదారులకు నేడు 8,57,25,134 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. బేస్మెంట్ స్థాయి పూర్తి చేసుకున్న నిర్మాణాలకు సొమ్మును ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తుందని అదేవిధంగా ఆయా దశల్లో నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్లకు కూడా చెల్లింపుల్లో జాప్యం లేకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకుజమ చేయడంజరుగుతుందన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ1.80 లక్షలు మంజూరు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన స్టీలు, సిమెంటు, ఇసుకను అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ దృష్ట్యా మంజూరు చేసిన ప్రతి ఇంటి నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ సూచించారు. అదే విధంగా ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను కూడా అందుబాటులో ఉంచుతున్నమన్నారు.