-ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి మెంబర్ సెక్రెటరీ డా. వై. అపర్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“ సుస్థిరమైన జీవనం కోసం విజ్ఞాన శాస్త్రం “ అనే అంశంపై ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు నిర్వహించిన ప్రదర్శనలలో రెండు ప్రాజెక్ట్ లు జాతీయ స్థాయికి ఎంపికైనవని మెంబర్ సెక్రటరీ డా. వై. అపర్ణ తెలిపారు. భవానీపురం లో గల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో డా. అపర్ణ ఈవివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా డా. అపర్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాలలో 2692 పాఠశాలల నుండి 3808 ఆవిష్కరణలను (ప్రాజెక్ట్ లు) సమీకరించామని వాటిలో 564 ప్రాజెక్ట్ లతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 2021 నవంబర్ లో జిల్లా స్థాయిలో ఈ ఆవిష్కరణలను నిర్వహించగా వాటిలో రాష్ట్ర స్థాయికి 168 ప్రాజెక్ట్ లు ఎంపిక కాబడ్డాయని,వాటిలో 2 ప్రాజెక్ట్ లు జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కృషికి నిదర్శనమన్నారు.
1983వ సంవత్సరం నుండి జాతీయ శాస్త్ర సాంకేతిక సమాచార మండలి (ఎన్ సి ఎస్ టి సి) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి (ఏ పి సి ఓ ఎస్ టీ) కృషి చేస్తున్నాయని అన్నారు. బాలలు తమలోని సృజనాత్మకతను ప్రదర్శించేందుకు శాస్త్రీయ పద్ధతులు ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేసి సామర్ధ్యాన్ని పెంచుకోవడం ద్వారా సమాజానికి ప్రయోజనాన్ని చేకూర్చేందుకు ఈ బాలల జాతీయ సమ్మేళనం ఒక వేదికగా ఉపయోగ పడుతుందనిఆమె తెలిపారు.
2021 మరియు 2022 సంవత్సరాలకు జాతీయ బాలల సమ్మేళనం (జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్) ప్రతిపాదించిన అంశమైన“ సుస్థిరమైన జీవనం కోసం విజ్ఞాన శాస్త్రం “ అనే అంశంపై పిల్లలు తమ ప్రాజెక్ట్ లను రూపొందించారని డా. అపర్ణ తెలిపారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన వారిలో కృష్ణా జిల్లా పెడన వి.జి.కే. జెడ్ పి హై స్కూల్ విద్యార్థి ఎన్. మోహన దుర్గా మణికంఠ “ స్మార్ట్ సొల్యూషన్ ఫర్ ఎకో పొల్యూషన్ “ పేరుతో చేసిన ప్రాజెక్ట్ జాతీయ స్థాయికి ఎంపిక అయినదని, ప్రకాశం జిల్లా బల్లికురవ జెడ్ పి హై స్కూల్ కు చెందిన విద్యార్థినిలు జి. జెసికా మరియు డి. యామిని ల “ ఎకో ఫ్రెండ్లీ క్యారీ బాగ్స్ “ అనే ప్రాజెక్ట్ జాతీయ స్థాయికి ఎంపిక కాబడినవని డా. అపర్ణ తెలిపారు.
APCOST గత 29 సంవత్సరాలుగా రాష్ట్రంలో బాలల విజ్ఞాన సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నది. ఈ సంస్థ రాష్ట్రంలోని అడవులు, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖకు అనుబంధంగా పని చేస్తున్నదని డా. అపర్ణ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేయబడిన 17 ప్రాజెక్ట్ లకు బాల శాస్త్ర వేత్తలను ప్రోత్సహించుటకు డా. కే.వి. రావు సైన్టిఫిక్ సొసైటీ హైదరాబాద్ వారి ద్వారా ప్రతి విద్యార్థికి 2 వేల రూపాయలు మరియు APCOST నుండి 1000 రూపాయలు రాష్ట్ర స్థాయిలో ఎంపికైన వారికీ ప్రోత్సహక బహుమతులుగా అందించామని ఆమె తెలిపారు. జాతీయ స్థాయి పోటీ కోసం బాల శాస్త్రవేత్తలకు సలహాలు సూచనలతో మార్గదర్శకులుగా గైడ్ టీచర్ లు కీలక పాత్ర పోషించారని వారికి డా. అపర్ణ అభినందనలు తెలిపారు.
ఈ సమావేశానికి ప్రాజెక్ట్ ఆఫీసర్ జె. దిల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.