– ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి
-ఎంత డిమాండ్ అయినా ఎదుర్కొంటాం
-వ్యవసాయ విద్యుత్ సరఫరా పై స్పెషల్ ఫోకస్
-రైతాంగానికి పగటి పూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా
-డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేస్తాం
-అందుకనుగుణంగానే విద్యుత్ సంస్థలు కార్యాచరణ
-మాది రైతు పక్షపాత ప్రభుత్వం
-వినియోగదారుల శ్రేయస్సే మా పరమావధి
-నవరత్నాలలో వ్యవసాయ విద్యుత్ కు ప్రత్యేక స్థానం కల్పించిన సి ఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి — ఇంధన శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి
-వేసవిలో పెరగనున్న డిమాండు ను దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక దాదాపు సిద్ధం – డిస్కమ్ సిఎండీలు హెచ్ హరనాథరావు, జే పద్మ జనార్దనరెడ్డి, కే సంతోషరావు
-7000 మెగా వాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుతో మరింత మేలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న రబీ లో పెరగనున్న విద్యుత్ డిమాండు ను పూర్తి స్థాయి లో అందుకునేందుకు విద్యుత్ సంస్థలు సన్నద్ధం అవుతున్నాయి. ప్రత్యేకించి వ్యవసాయ విద్యుత్ కు డిమాండ్ పెరగనున్న దృష్ట్యా పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు విద్యుత్ సంస్థలు పటిష్ట కార్యాచరణ ప్రణాలికను సిద్ధంచేస్తున్నాయి. రైతులతో పాటు సాధారణ వినియోగదారులకు , వాణిజ్య , పరిశ్రమలకు కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా కొనసాగించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. విద్యుత్ డిమండ్ ఎంత పెరిగినా దాన్ని అందుకునేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి
వ్యవసాయానికి విద్యుత్ సరఫరా పరిస్థితిపై విద్యుత్ సంస్థల అధికారులతో ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి టెలిఫోన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్నది వేసవి కాలం కావడంతో విద్యుత్ డిమాండ్ పెరగనున్న దృష్ట్యా వ్యవసాయానికి అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తును అందించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని డిస్కంలను ఆదేశించారు.
రాష్ట్రంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించి 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 19,096 మిలియన్ యూనిట్ల మేర డిమాండ్ ఉంది. అదే 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఈ డిమాండ్ 19819 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది 3.7 శాతం మేర విద్యుత్ వినియోగం పెరగనుందని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని రంగాల్లోని రోజువారీ సగటు ఇంధన వినియోగం జనవరి-2022 లో 178.90 మిలియన్ యూనిట్లు కాగా, జనవరి-2021లో 171.92 మిలియన్ యూనిట్లుగా నమోదైందని, ఇది 4.06% సానుకూల వృద్ధిని నమోదు చేసిందని విద్యుత్ శాఖ అధికారులు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. అదే విధంగా జనవరి -2022లో గరిష్ట డిమాండ్ 10122 మెగావాట్లుగా ఉండగా, జనవరి -2021లో 9977 మెగావాట్లుగా ఉందని, ఇది 1.45% సానుకూల వృద్ధిని నమోదు చేసిందని వివరించారు.
విద్యుత్ డిమాండ్ మార్చి నుండి మే-2022 వరకు 20,143 మిలియన్ యూనిట్లుగా అంచనా వేయడం జరిగిందన్నారు. ఇది 2021లో ఇదే కాలానికి 19,066 మిలియన్ యనిట్లతో పోలిస్తే 5.6 శాతం పెరిగినట్లు తెలిపారు. అంటే దీనినిబట్టి చూస్తే ప్రతి ఏటా డిమాండ్ పెరుగుతూ వస్తోందని అర్ధమౌతోందన్నారు. జనవరి నుండి డిసెంబర్-2018 (క్యాలెండర్ సంవత్సరం) వరకు నమోదైన వాస్తవ ఇంధన డిమాండ్ 63,097 మిలియన్ యూనిట్లుగా ఉందని, ఇది 2020-21లో అదే కాలానికి 8.5 శాతం పెరిగి 68,431 మిలియన్ యూనిట్లకు చేరుకుందన్నారు. అదేవిధంగా 2018లో ఉన్న 8933 మెగావాట్ల గరిష్ట డిమాండ్ 2021 నాటికి 10160 మెగావాట్లకు పెరిగిందని అధికారులు తెలిపారు.
వ్యవసాయ అవసరాల మేరకు విద్యుత్ డిమాండ్‌ను అందుకునేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని డిస్కమ్ల సీఎండీలు హెచ్ హరనాథరావు, జే పద్మ జనార్దనరెడ్డి, కే సంతోషరావు మంత్రికి వివరించారు. విద్యుత్ లోడ్, కచ్చితమైన విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఏడాదిలోగా మీటర్లు బిగించేందుకు కృషి చేస్తున్నామని డిస్కమ్ల సీఎండీలు వివరించారు. ఇది డిస్కమ్లకు ప్రతి మోటారు వద్ద ఉన్న లోడ్ను తెలుసుకునేందుకు దోహదపడుతుందని తెలిపారు. తద్వారా మౌలిక సదుపాయాలను (ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, సబ్స్టేషన్లు) వంటివాటిని పెంచడానికి వీలు కల్పిస్తుందని వివరించారు. దీనివల్ల వ్యవసాయ విద్యుత్ మోటార్లు కాలిపోయే ప్రమాదాలను అరికట్టడంతోపాటు రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు వీలవుతుందని తెలిపారు.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుండి రాబోయే 7000 మెగావాట్ల సౌర విద్యుత్ ద్వారా వ్యవసాయ ఫీడర్లకు పగటి పూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రాబోయే 25 సంవత్సరాల పాటు రైతులకు ఉచిత విద్యుత్ను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు
ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ, తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషిచేస్తోందన్నారు. అదేక్రమంలో వ్యవసాయానికి 9 గంటల మేర పగటిపూట విద్యుత్ సరఫరా చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18 లక్షల కనెక్షన్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుందని మంత్రి వెల్లడించారు. రాష్ర్టవ్యాప్తంగా 6663 వ్యవసాయ ఫీడర్ల ద్వారా రైతులకు ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ పథకానికి ప్రభుత్వం రూ. 7714 కోట్ల సబ్సిడీని అందిస్తోందని, మొత్తంగా రైతుల ప్రయోజనాలను కాపాడడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టంచేశారు.నవరత్నాలలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కు ముఖ్యమంత్రి ప్రత్యేక స్థానం కలిపించారని మంత్రి పేర్కొన్నారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ అందుకోవడానికి విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వినియోగదారుల శ్రేయస్సే పరమావధిగా విద్యుత్ సంస్థలు కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు.
ప్రతి ఏటా ఎంత విద్యుత్ డిమాండ్ పెరిగిన దాన్ని అందుకుంటూ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్న విద్యుత్ సిబ్బందిని , విద్యుత్ సంస్థల / డిస్కమ్ ల సిఎండీలను మంత్రి అభినందించారు. నవరత్నాలలో భాగంగా వ్యవసాయ రంగానికి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందించే వై ఎస్ ఆర్ ఉచిత విద్యుత్ పథకం సక్సెస్ అయిందని మంత్రి వెల్లడించారు
సాంకేతిక సమస్యల వల్ల విద్యుత్ సరఫరా లో అంతరాయాలు ఏమైనా ఏర్పడితే అదే రోజు పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సరైన విద్యుత్ ఉత్పత్తిని చేయడానికి తగినంత బొగ్గు నిల్వలను సమకూర్చుకోవాలని మంత్రి, జెన్కో ఎండీ బీ.శ్రీధర్ కు సూచించారు. రోజువారీ పెరుగుతున్న గ్రిడ్ డిమాండ్ ను అందుకోవడానికి అన్ని వనరులను ఉపయోగించుకోవాలని విద్యుత్ సంస్థలకు మంత్రి తెలిపారు.
ప్రతి ఏటా ఎంత విద్యుత్ డిమాండ్ పెరిగిన దాన్ని అందుకుంటూ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్న విద్యుత్ సిబ్బందిని , విద్యుత్ సంస్థల / డిస్కమ్ ల సిఎండీలను మంత్రి అభినందించారు. నవరత్నాలలో భాగంగా వ్యవసాయ రంగానికి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందించే వై ఎస్ ఆర్ ఉచిత విద్యుత్ పథకం సక్సెస్ అయిందని మంత్రి వెల్లడించారు
ఈ సందర్భంగా డిస్కమ్ల సిఎండిలు విద్యుత్ సరఫరా ప్రణాళిక గురించి మంత్రికి వివరించారు. అలాగే ఫీడర్ వారీగా పర్యవేక్షణ చేస్తున్నామని, వినియోగదారులకు ముందస్తుగా ప్రింట్ మీడియా ద్వారా లేదా మొబైల్ సందేశాల ద్వారా ప్రణాళికాబద్ధమైన అంతరాయం గురించి తెలియజేస్తున్నామని చెప్పారు.