-రథోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లయకారుడు పరమశివుని ఆశీస్సులు ప్రతిఒక్కరిపై ఉండాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అభిలషించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వన్ టౌన్ కెనాల్ రోడ్డులోని వరసిద్ధి వినాయక దేవస్థానం నందు రథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సాదర స్వాగతం పలికారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పరమశివుడు సర్వాంతర్యామి అని, లోకాలన్నింటినీ శాసించగల ఆదిభిక్షువు అని పేర్కొన్నారు. అజ్ఞానమనే చీకటి నుంచి ప్రతి ఒక్కరికీ పరమశివుడు జ్ఞాన జ్యోతిని ప్రసాదించాలని ప్రారించినట్లు వెల్లడించారు. అనంతరం ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు తాడి సత్యనారాయణ, గొంట్ల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.