-మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశాభివృద్ధిలో మహిళా సాధికారత ఎంతో కీలకమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కచెల్లెమ్మలందరికీ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ విజయాలు సాధిస్తూ.. కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. అటువంటి స్త్రీలను ప్రతిఒక్కరూ గౌరవించాలని, వారి హక్కులకు ఎటువంటి భంగం కలిగించకూడదని సూచించారు. రాష్ట్రంలో మహిళల అభ్యుదయానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చిత్తశుద్దితో శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని మల్లాది విష్ణు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తోన్న ప్రోత్సాహంతో.. పాలనలో, అభివృద్ధిలోనూ అతివలు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. దేశంలోనే ప్రప్రథమంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్స్ అమలు చేస్తున్న ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెల్లిందన్నారు. ఇవేగాక మహిళల భద్రత, సంక్షేమం, సాధికారత కోసం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, మహిళల పేరుతో ఇంటి స్థలాలు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ వంటి పథకాల ద్వారా వారికి పెద్దఎత్తున లబ్ధి చేకూరుస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక కార్యక్రమాలు.. మహిళకు ఆర్థిక సామాజిక సమానత్వం దిశగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయన్నారు. కనుకనే ‘మహిళా పక్షపాత ప్రభుత్వం’గా అనతికాలంలోనే జగనన్న సర్కార్ మహిళాలోకంచే కీర్తింపబడుతోందని మల్లాది విష్ణు తెలిపారు.
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. మహిళా సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. కుటుంబానికి, సమాజానికి, దేశాభివృద్ధికి మహిళల సేవ, త్యాగం, కృషి అభినందనీయమన్నారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాలలో విశిష్ట సేవలందిస్తోన్న మహిళలను ఘనంగా సత్కరించారు. సన్మానం అందుకున్న వారిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, ఉపాధ్యాయురాలు రాయనపాటి శ్రీవాణి, అస్ట్రాలజిస్ట్ నెమలికంటి అనుపమ శ్రీదేవి, గృహిణి మేకల నాగలక్ష్మి ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాకినేని బసవపున్నయ్య స్టేడియం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు N.B.G.M. ప్రసాద్, కార్యదర్శి బి.రమేష్, ట్రెజరర్ టి.రాఘవరావు, వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ తల్లం గంగాధరన్, సీహెచ్ చిన్నా, జస్వంత్ కుమార్, కె.శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.