విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ హౌస్ లో ఈ రోజు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ ఛైర్మన్ శ్రీ ఏ. మల్లికార్జున రెడ్డి మరియు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్.ద్వారకాతిరుమలరావు,ఐ.పి.ఎస్. ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ప్రధాన కార్యాలయంలో పనిచేసే మహిళలందరికీ వారు ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
సంస్థ ఛైర్మన్ ఏ.మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుతున్నారని కొనియాడారు. మన సంస్థలో కూడా మహిళలు చాలా కష్టపడుతూ విధులు నిర్వర్తిస్తున్నారని కండక్టర్లుగా, ఇంచార్జ్ లుగా, కానిస్టేబుల్ గా, ఆఫీసుల్లో కూడా సేవలందిస్తూ వారి ప్రత్యేకతను చాటుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యతను కల్పిస్తున్నారన్నారు. మహిళామణుల త్యాగాలు వెలకట్టలేనివని వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తన హయాంలో హోం మంత్రి పదవి సబితా ఇంద్రారెడ్డి కి ఇచ్చి మహిళలు ధైర్యంగా ఏ పదవి నైనా చేయగలరని నిరూపించారని తెలిపారు. అదే మాదిరి జగన్ మోహన్ రెడ్డి కూడా తన మంత్రి వర్గ విస్తరణలో మహిళలకు పెద్ద పీట వేసారని కొనియాడారు. మహిళలంతా సంస్థ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. మాట్లాడుతూ, మహిళ లేనిదే ఏ కుటుంబం లేదని, కుటుంబ బాధ్యతలు నెరవేర్చడమే కాకుండా అన్ని రంగాలలోనూ వారు తమ నైపుణ్యంతో ఉనికిని చాటుకుని సాధికారత సాధించారన్నారు. అదే విధంగా ఈ రోజు ప్రధాన కార్యాలయంలోని మహిళలందరినీ ఒకే చోట చూస్తుంటే కన్నుల పండుగగా ఉందని, ఈ వేడుకలు నిర్వహించడం చాలాఆనందంగా ఉందన్నారు. మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం, వారి పట్ల మనమంతా కృతజ్ఞతా భావంతో మెలగాలన్నారు. సంస్థలోని మహిళలు చాలా ఓర్పు, సహనంతో విధులు నిర్వర్తించి సంస్థ ప్రగతిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారన్నారు. మహిళలు పురుషల కంటే ఏమీ తీసిపోరని నిరూపిస్తున్నారన్నారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు, ఇంటి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ వారి యొక్క మనోబలంతో స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారన్నారు. సంస్థలో ప్రతిభ కనబరిచిన మహిళలను ఈ సందర్భంగా అభినందించడం వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ ఏ.మల్లికార్జున రెడ్డి మరియు మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్. ద్వారకా తిరుమల రావు,ఐ.పి.ఎస్. ఇరువురూ హెడ్డాఫీసులోని వివిధ విభాగాలలో ప్రతిభ కనబరచిన 5 గురు మహిళా ఉద్యోగులకు ఒక్కొక్కరికీ రూ.500/- క్యాష్ అవార్డుతో పాటు ప్రశంసాపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏ. కోటేశ్వర రావు, ఇ.డి.(అడ్మినిస్ట్రేషన్), రాఘవ రెడ్డి (ఫైనాన్శియల్ అడ్వైజరు) లతో పాటు, అన్ని స్థాయిలలోని మహిళా ఉద్యోగులందరూ పాల్గొన్నారు. అనంతరం వారంతా కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
Tags vijayawada
Check Also
6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) …