-ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ డి. గౌతమి
-రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు
-స్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ డి. గౌతమి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగాయి. మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా స్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఉచిత గైనకాలజీ వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గౌతమి మాట్లాడుతూ పురుషులతో పోటీపడటమో, పురుషుల వలె వ్యవహరించడమో స్త్రీ సాధికారత అనిపించుకోదని, మహిళలు తమంతట తాము స్వతంత్రంగా, స్వేచ్ఛగా వ్యవహరించగలిగిన నాడే సాధికారత సాధించినట్లవుతుందని పేర్కొన్నారు. విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని, మహిళలు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని తండ్రి, భర్త అందించాలని అన్నారు. ప్రతి మహిళ తన సొంత అస్థిత్వాన్ని రూపొందించుకున్న నాడే సంపూర్ణ మహిళా సాధికారత సిద్ధిస్తుందని డాక్టర్ గౌతమి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని, మహిళలందరూ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని హితవు పలికారు. స్త్రీలకు సహజంగా సంక్రమించే రక్తహీనత, హైపో థైరాయిడిజం, హార్మోన్ల అసమతుల్యత, విటమిన్లు, కాల్షియం లోపాలను అధిగమించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని డాక్టర్ గౌతమి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ ఎస్. రవి శంకర్ నారాయణ్, కమిషనర్ ఎన్. సుభద్ర, స్పెషల్ కమిషనర్ సీహెచ్. రాజేశ్వర్ రెడ్డి, కమిషనర్లు రవి శంకర్, డి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.