-తమ సమస్యలపై ఎమ్మెల్యేకు మెమోరెండం అందజేత
-సమస్య పరిష్కారంపై పాఠశాల విద్యా శాఖ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడటంపై హర్షం వ్యక్తం చేసిన టీచర్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చిన నేపథ్యంలో పలువురు ఉపాధ్యాయులు ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఎక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులను అదే ప్రాంతాలలో అవకాశం లభిస్తుందని ఆశించిన ఉపాధ్యాయులను దూర ప్రాంతాలలో 3, 4 కేటగిరీలలో చూపడంతో తామంతా ఆందోళనకు గురవతున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో నగరంలో పనిచేస్తున్న టీచర్లందరూ దాదాపు 100 – 150 కి.మీ. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసింది వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన గౌరవ శాసనసభ్యులు ఈ అంశంపై పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ గారితో ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఎయిడెడ్ టీచర్లందరూ దాదాపు 50 ఏళ్లు పైబడిన వారు కావడంతో.. సుదూర ప్రాంతాలకు ప్రయాణించలేరని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. కనుక వీరందరినీ నగర పాలక సంస్థ పాఠశాలల్లో కానీ, జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల్లో కానీ సర్దుబాటు చేయవలసిందిగా కోరారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ గారు.. ఈ అంశంపై కూలంకషంగా చర్చించిన తర్వాత కౌన్సిలింగ్ తేదీని తెలియపరుస్తామని చెప్పడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఎస్.కృష్ణారెడ్డి, యల్లాప్రగడ సుధీర్ బాబు, కృష్ణ, మాధవి, సారా, జోసఫ్, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.