-శ్రీశ్రీశ్రీ గంగానమ్మ దేవస్థాన వార్షిక మహోత్సవాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం అయోధ్య నగర్లోని శ్రీ శ్రీ శ్రీ గంగానమ్మ దేవస్థానం 7వ వార్షికోత్సవ మహోత్సవం బుధవారం కన్నులపండువగా జరిగింది. అమ్మవారికి ఉదయం మూల మంత్రాలతో అర్చన, అభిషేకములు, హోమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహ ఊరేగింపు కార్యక్రమం మేళతాళాల నడుమ వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం గంగానమ్మ దేవస్థాన వార్షిక వేడుకలలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ప్రతి ఒక్కరిలో భక్తి భావం, దైవ చింతన పెరగాలని.. భక్తితో మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. తద్వారా సమాజంలో శాంతి నెలకొంటుందన్నారు. జగన్మాత దివ్యాశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని వేడుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి గుండె సుందర్ పాల్, ఆలయ కమిటీ సభ్యులు వీరంకి నాగు, రామకృష్ణ, వెంకన్న, నాయకులు ఆదిరెడ్డి, జొన్నలగడ్డ రమేష్, శ్యాంబాబు, శ్రీను, రంగబాబు, త్రివేణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.