-రాష్ట్ర ఉన్నత విద్యా కౌన్సిల్ చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న విద్యా దీవెన పథకం క్రింద పూర్తి స్థాయిలో బోధనా రుసుమును ప్రభుత్వమే చెల్లిస్తుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎటు వంటి ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర ఉన్నత విద్యా కౌన్సిల్ చైర్మన్ కె.హేమ చంద్రా రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత ఏడాది అక్టోబరు, నవంబరు, డిశంబరు త్రైమాసికానికి చెందిన జగనన్న విద్యా దీవెన నాల్గో విడత బోధనా రుసుమును ప్రస్తుతం జరుగుచున్న అసెంబ్లీ సమావేశాల తదుపరి ఈ నెలలోనే విడుదల చేస్తామని, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మరియు మార్చి త్రైమాసికానికి సంబందించి జగనన్నవిద్యా దీవెన మొదటి విడత బోధనా రుసుమును వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టంచేశారు. బుధవారం సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు విద్యా దీవెన పథకాన్ని ప్రభుత్వం ఏవిధంగా అమలు చేస్తున్నదో వివరించారు. రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులు అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో జగనన్న విద్యా దీవెన పధకాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు కళాశాలలకు చెల్లించే ఫీజును ప్రభుత్వమే పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ క్రింద తల్లుల ఖాతాలో జమచేయడం జరుగుచున్నదన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం క్రింద ఏమైనా బకాయిలు ఉంటే విద్యార్థులకు కళాశాలలు నాణ్యమైన విద్యను అందించలేవని, ఆర్థిక భారంతో కళాశాలలు సతమతం అవుతాయనే విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ఎంతో పటిష్టంగా అమలు పర్చే అంశంపై ప్రత్యేక దృష్టిసారించారన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం క్రింద ఎటు వంటి బకాయిలు లేకుండా పూర్తి స్థాయిలో అమలు పర్చేందుకై గత ప్రభుత్వ బకాయిలు రూ.1,880 కోట్లు కలుపుకుని 2019-20 ఆర్థిక సంవత్సరం మార్చి మాసంలో మొత్తం రూ.4 వేల కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేశారన్నారు. కరోనా ప్రభావంతో ప్రభుత్వం పలు సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి సంబందించి 2021 ఏప్రిల్ మాసంలో రూ.671.03 కోట్లను, రెండో త్రైమాసికానికి సంబంధించి జూలై మాసంలో రూ.693.27 కోట్లను, మూడో త్రైమాసికానికి సంబంధించి నవంబరు మాసంలో రూ.683.13 కోట్లను జగనన్న విద్యా దీవెన పథకం క్రింద ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. నాల్గో త్రైమాసికానికి సంబందించి అసెంబ్లీ సమావేశాలు అయిన తదుపరి ఈ నెలలోనే విడుల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలుపై గత ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ద చూపలేదని క్రమ పద్దతిలో కళాశాలలకు పీజులు చెల్లించకుండా పెద్ద ఎత్తున బకాయిలు పెట్టిందని, గత ప్రభుత్వ బకాయిలు రూ.1,880 కోట్లను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి చెల్లించడం జరిగిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఆర్థిక సంవత్సరంలో కూడా పూర్తి స్థాయిలో బోధనా రుసుమును కళాశాలలకు చెల్లించలేదని, కొద్ది కొద్ది మొత్తాలను మాత్రమే చెల్లిస్తూ ఏళ్ల తరబడి బకాయిలు పెట్టిందని అన్నారు. ఈ పథకం క్రింద గత ప్రభుత్వం 2012-13 నుండి 2016-17 ఆర్థిక సంత్సరాలకు సంబందించి 2016-17 అర్థిక సంవత్సరంలో రూ.2,391.30 కోట్లను, 2012-13 నుండి 2017-18 ఆర్థిక సంత్సరాలకు సంబందించి 2017-18 అర్థిక సంవత్సరంలో రూ.2,828.30 కోట్లను మరియు 2012-13 నుండి 2018-19 ఆర్థిక సంత్సరాలకు సంబందించి 2018-19 అర్థిక సంవత్సరంలో రూ.1,687.13 కోట్లను చెల్లించినట్లు ఆయన వివరించారు. ఇలా ఆలశ్యంగా చెల్లించడం వల్ల 7 శాతం వడ్డీగా లెక్కకడితే దాదాపు రూ.1,000 కోట్ల వడ్డీ భారం కళాశాలలపై పడిందని తెలిపారు, అదే 14 శాతం వడ్డీ అయితే రూ.2,000 కోట్ల భారం పడుతుందని ఆయన తెలిపారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఎంతో చిత్తశుద్దితో అమలుచేస్తూ పూర్తి స్థాయిలో బోధనా రుసుమును సకాలంలో చెల్లించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నట్లు ఆయన తెలిపారు. 2018-19 మరియు 2019-20 మద్య కాలంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (GER) గ్రోత్ రేట్ 32.4 శాతం నుండి 35.2 శాతానికి పెరిగిందన్నారు. గత రెండేళ్ల కాలంలో పలు కళాశాలల్లో 70 వేలకు పైబడి అడ్మిషన్లు జరిగాయని ఆయన తెలిపారు. భారత దేశం గ్రోత్ రేటు కంటే ఈ గ్రోత్ రేటు ఎంతో అదికమన్నారు. అదే విధంగా ఎస్సీ విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (GER) గ్రోత్ రేట్ దేశంలో 1.7 శాతం ఉంటే రాష్ట్రంలో 7.5 శాతంగాను, ఎస్టీ విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (GER) గ్రోత్ రేట్ దేశంలో 4.5 శాతం ఉంటే రాష్ట్రంలో 9.5 శాతంగాను మరియు మహిళా విద్యార్థుల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (GER) గ్రోత్ రేట్ దేశంలో 2.28 శాతం ఉంటే రాష్ట్రంలో 11.03 శాతంగా నమోదైనట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలోనే ప్రప్రథమంగా హైకోర్టు రిటైర్డు జడ్జి చైర్మన్ గా ఉన్నత విద్యా రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ కమిషన్ తమ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, కళాశాలలపై వచ్చే ఫిర్యాదులపై తగు చర్యలు తీసుకొనేందుకు ఈ కమిషన్ కు అధికారం ఉందన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం క్రింద పూర్తి స్థాయిలో బోధనా రుసుమును ప్రభుత్వమే చెల్లిస్తుందని, అంతకు మించి ఎటు వంటి సొమ్మును అధనంగా కళాశాలలకు చెల్లించాల్సిన పనిలేదని ఆయన తెలిపారు. నాణ్యమైన విద్యను అందించని మరియు నియమ, నిబంధనలను అతిక్రమించే కళాశాలలపై ఈ కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చని విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆయన విజ్ఞప్తిచేశారు.