– పేదలందరికీ ఇళ్ల పధకంలో ప్రతీ లబ్ధిదారుడు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి: * ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలి : జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ )నుపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్
జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ఇళ్ల కాలనీలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ )నుపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జి.కొండూరు మండలం కవులూరు లోని అర్బన్ లే అవుట్ పనులను అధికారులతో కలిసి జేసీ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్ల పధకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఇది సరైన సమయమని, సంబంధిత శాఖల అధికారులందరూ జగనన్న ఇళ్ల పథకంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని, నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. పేదలందరికీ ఇళ్ళు పధకంలోని ప్రతీ లబ్ధిదారుడు ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న ఇళ్ల లేఔట్ లలో నిర్మాణ మెటీరియల్ నిర్మాణ ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా రోడ్లు నిర్మించాలన్నారు. ఆంతేకాక విద్యుత్, నీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు కపించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. డ్వాక్రా మహిళా లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి అదనపు రుణాలు మంజూరు చేయడం జరిగిందని, రుణాలు తీసుకున్న లబ్దిదారులందరూ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఉచిత ఇసుక, సబ్సిడీపై అందిస్తున్న సిమెంట్, ఐరన్ వంటి నిర్మాణ సామాగ్రి ఎటువంటి జాప్యం లేకుండా లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణానికి సంబందించిన బిల్లుల చెలింపులు నిర్ణీత సమయంలోగా చెలించేందుకు గృహ నిర్మాణ శాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ తో పాటు తహసిల్దార్ , హౌసింగ్, పంచాయతీరాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.