-ఎల్బీఎస్ నగర్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థల పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద, సామాన్య ప్రజలందరూ అట్టహాసంగా పెండ్లి వేడుకలు జరుపుకునే విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో కాపు కమ్యూనిటీ హాల్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కళ్యాణ మండప నిర్మాణానికి సంబంధించి ఎల్బీఎస్ నగర్ లో గురువారం స్థల పరిశీలన చేశారు. ఇందులో భాగంగా కాపు కార్పొరేషన్ ఎండీ రేఖా రాణి, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజకుమారిలతో కలిసి పుచ్చలపల్లి సుందరయ్య ప్రభుత్వ పాఠశాల పక్కనే ఉన్న దాదాపు 1,750 గజాల ఖాళీ స్థలాల్ని పరిశీలించారు. సామాన్యులకు వివాహాది శుభకార్యాలు భారమైన ప్రస్తుత తరుణంలో.. కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో రూ. కోటి నిధులు మంజూరైనట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ఈ మేరకు డిసెంబర్ 29, 2021 న రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.165 విడుదల చేసినట్లు తెలిపారు. ఎల్బీఎస్ నగర్ లో ఈ నిధులతో కళ్యాణ మండపం నిర్మాణానికి చర్యలు తీసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. మారుతున్న కాలానికనుగుణంగా పేద ప్రజలు అట్టహాసంగా తమ పిల్లల వివాహాలు, ఇతర శుభకార్యాలు జరిపించుకునేందుకు నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్‌ను ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. ఈ మేరకు డిజైన్లు సిద్ధం చేయవలసిందిగా వీఎంసీ అధికారులకు సూచించారు. కాపు సామాజికవర్గ సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా మరోసారి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డీఈ గురునాథం, ఏఈ మౌసమి, కార్పొరేటర్లు అలంపూరు విజయలక్ష్మి, జానారెడ్డి, నాయకులు అలంపూరు విజయ్, కె.వీరబాబు, బోరాబుజ్జి, ఎన్.శ్రీనివాస్, వీరంకి నాగేశ్వరరావు, వెంకట రామిరెడ్డి, SK మస్తాన్, హైమావతి, సావిత్రి, రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు.