విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మూడు రాజధానుల తీర్పుపై వైసిపి నాయకులు ఎవరికి వారు తీర్పును వక్రీకరించి ప్రజలలో అపోహలు అపనమ్మకాన్ని కల్పించే విధంగా బురదజల్లే కార్యక్రమం చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్టేట్ లీగల్ సెల్ చైర్మన్ వి గురునాధం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైకోర్టు 3 రాజధానులు పై త్రిసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పుపై నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చలో హైకోర్టు తన పరిధి దాటుతుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించడం కోర్టు ధిక్కారమేనన్నారు. శాసనసభ చట్టాలు తయారు చేసే అధికారం, అలాగే ప్రజలు ఆ చట్టాలను కోర్టులో సవాలు చేసే అధికారం, చట్టాలను సవాలు చేస్తూ కోర్టులో వేసిన పిటిషన్ పై తీర్పు చెప్పే అధికారం హైకోర్టు ఉంటుందన్నారు. తీర్పుపై బురదజల్లే కార్యక్రమాన్ని ఎవరికివారు వైసిపి నాయకులు విజయవంతంగా నిర్వహిస్తున్నారని, ఈ విధంగా రాజ్యాంగబద్ధమైన కోర్టు తీర్పులపై బురదజల్లే విధానాన్ని ఏపీసీసీ లీగల్ తీవ్రంగా ఖండిస్తుందనీ… రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టబద్దంగా రాజ్యాంగబద్ధంగా లేదు అని అనిపించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టుకు అప్పీలు చేయాలే తప్పా, తీర్పుపై అసెంబ్లీలో చర్చించడం, తీర్పుపై ప్రజలలో వ్యతిరేక భావం అపనమ్మకాన్ని కలగజేయడం రాజ్యాంగ విరుద్ధం మరియు కోర్టు ధిక్కారమేనన్నారు. నిన్న అసెంబ్లీలో ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కోర్టులు హద్దులు మీరినవి అని చెప్పడం విడ్డూరమన్నారు. న్యాయ శాస్త్రం చదివిన ధర్మాన ప్రసాదరావు సంబంధంలేని తీర్పులపై అసెంబ్లీలో చర్చించడం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మెప్పుకోసం, క్యాబినెట్లో బెర్త్ కోసమేనన్నారు.హైకోర్టు తీర్పు సిఆర్డిఏ నిబంధనలకు లోబడి, చట్టాలకు లోబడి మాత్రమే నిర్ణయించబడిందనీ, హైకోర్టు తన తీర్పులో ఎక్కడ కూడా అసెంబ్లీకి చట్టాలు చేసే అధికారం లేదని చెప్పలేదనీ, కానీ యావత్తు వైయస్సార్ పార్టీ నాయకులు అసెంబ్లీ చట్టాలను చేయకూడదని తీర్పు చెప్పిందంటూ ప్రజలకు వక్రీకరించి చెప్పడం పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకమని వైఎస్సార్సీపీ నాయకులు మరియు ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఏపీసీసీ లీగల్ సెల్ తరపున ఖండించడమైనదన్నారు. హైకోర్టు తన తీర్పులో హద్దు మీరితే మీ ప్రభుత్వం ఇంత వరకు సుప్రీంకోర్టుకు ఎందుకని అప్పీల్ చేయలేదని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరపున ప్రశ్నించడమైనదన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …