ఉగాది నుండి గడప గడపకు వైఎస్సార్ సీపీ: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-నగర కమిషనర్ రంజిత్ భాషాతో కలిసి డివిజన్ల పర్యటన
-ప్రజలకు సురక్షిత త్రాగు నీరందిస్తాం: కమిషనర్ రంజిత్ భాషా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణ పరిష్కార దిశగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నగర కమిషనర్ రంజిత్ భాషాతో కలిసి 57, 62, 64 డివిజన్లలో శనివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. తొలుత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి న్యూ రాజరాజేశ్వరి పేట చేరుకున్నారు. క్షేత్రస్థాయిలో తాగునీరు సరఫరా అవుతున్న తీరుపై స్థానికులను ఆరా తీశారు. నగర ప్రజలకు సురక్షితమైన తాగునీటి సరఫరా అందించేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా నీటిలో క్లోరిన్‌ శాతం పరిమిత స్థాయిలో ఉన్నది లేనిది మీటర్ ద్వారా పరిశీలించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించని నీటిని అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి తెలిపారు. అనంతరం ఎల్బీఎస్ నగర్లో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. తదననంతరం కండ్రికలోని కెకె అపార్ట్ మెంట్ చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మురుగుకాలువలు వ్యర్థాలతో పూడుకుపోవడంతో తక్షణమే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా ప్రజలు కూడా చెత్త చెదారాలు, ప్లాస్టిక్ డబ్బాలు, వ్యర్థాలను కాలువలలో పడవేయవద్దని కోరారు. వీటి ద్వారా డ్రైనేజీలు నిండుకొని రోడ్లపై పొంగిపోర్లే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో అధికారులు, సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. స్థానిక సమస్యలపై పలువురి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.

అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి డివిజన్, కాలనీలలో పర్యటించి వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తున్నట్లు వెల్లడించారు. కొన్ని ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటుగా.. మరికొన్ని చోట్ల ప్రజావసరాలకు అనుగుణంగా త్రాగునీటి పైపులైన్లను ఆధునికీకరిస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి డెవలప్ మెంట్ ఫండ్ నుంచి నియోజకవర్గానికి రూ. 2 కోట్ల నిధులు మంజూరైనట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. ఈ నిధులతో ప్రజలకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. మరోవైపు ఉగాది నుంచి గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా ప్రజలు జగనన్న సంక్షేమ రాజ్యంలో లబ్ధి పొందిన వివరాలను పొందుపరిచిన బుక్ లెట్లను ఇంటింటికి తిరిగి అందజేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించవలసిందిగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.

నగర కమిషనర్ రంజిత్ భాషా మాట్లాడుతూ.. డివిజన్ల పర్యటనలో డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలను ప్రధానంగా గుర్తించినట్లు వెల్లడించారు. సమస్యల పరిష్కానికి తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కండ్రికలోని కెకె అపార్ట్ మెంట్ వద్ద ప్రజల తాగునీటి అవసరాలకు అనుగుణంగా ఒక మంచినీటి బోరును కూడా మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఇసరపు దేవి, అలంపూరు విజయలక్ష్మి, నాయకులు యరగొర్ల శ్రీరాములు, అలంపూరు విజయ్, ఇసరపు రాజా రమేష్, కాళ్ల ఆదినారాయణ, ఖాన్, వీరబాబు, బోరాబుజ్జి, రామిరెడ్డి, గుర్రాల ఏసుబాబు, జె.డి.కృప, జి.వెంకటేశ్వరమ్మ, వీఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *