-ఏప్రిల్ 7న విశాఖపట్నం లో రాష్ట్రస్థాయి నిరసన
-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ ప్రజలను దోచుకోవడానికే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. 8 సంవత్సరాల కాలంలో అక్షరాలా రూ. 26లక్షల కోట్లను ప్రజలనుంచి దోచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పెట్రో ఉత్పత్తులపై పన్నులు తక్కువగా ఉండేవని, బీజేపీ అధికారంలోకి వచ్చాక దోచుకెవడమే పరమావధిగా మారిందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని శైలజనాథ్ వెల్లడించారు. బుధవారం ఆయన విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 31న కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిరసనలో పాల్గోంటారన్నారు. ఏప్రిల్ 7న విశాఖపట్నం లో రాష్ట్రస్థాయి నిరసన జరుగుతుందని చెప్పారు.
పేదల ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నం
మోదీ ప్రభుత్వంలో భారతీయుల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని విమర్శించారు. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు పెంచడం దారుణమని ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ద్వారా 26లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి దోచుకుందని అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించి జీఎస్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ దేశానికి ఏం మేలు చేసారో చెప్పాలని, అదానీ, అంబానీలకు మేలు చేశారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు భరించే స్థితిలో లేరని, ఎన్నికల్లో గెలుపు చూసుకుని వాపు అనుకుంటున్న బీజేపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని శైలజానాథ్ హెచ్చరించారు.
బీజేపీ చెప్పేదొకటి చేసేదొకటి
బీజేపీ చెప్పేదొకటి చేసేదొకటి అని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ముందు అసలు పెంచకుండా ఇప్పుడు పెంచడం మోసం చేయడమే అని అన్నారు. ప్రజలపై భారాలు వేస్తూ ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారని అన్నారు. అనంతపురం, కర్నూల్లో గ్యాస్ ధరలు 1000 రూపాయలు దాటిందన్నారు. ప్రజలను దోచుకోవడానికే అధికారంలోకి వచ్చారా అని నిలదీశారు. యుద్ధం వలన ధరలు పెరిగాయని చెబుతున్నారని, కానీ రష్యాకు తటస్థంగా ఉన్నందుకు తక్కువ ధరకె డీజిల్, పెట్రోల్ ఇస్తామన్నారని తెలిపారు. ఉక్రెయిన్పై యుద్ధం విషయంలో తటస్థంగా ఉన్నది మీరే కదా అని అన్నారు.
జగన్ రెడ్డి ప్యాలెస్ నుండి బయటకు రావాలి
జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల కోసమే అని ప్యాలస్లో కూర్చుని మాట్లాడతారని మండిపడ్డారు. ఏపీలో రూ.117 పెట్రోల్ ధర ఉందని, మిగిలిన రాష్ట్రాల్లో మనకంటే 10 రూపాయలు తక్కువ ఉందని చెప్పారు. ఆటో కార్మికుల జీవితాలను దుర్భరం చేస్తున్నారన్నారు. నిరసన తెలిపితే కేసులు, దాడులు, లేదా దేశ ద్రోహం కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ ధరలు పెంచితే ఇక్కడ జగన్ చప్పట్లు కొడుతున్నారన్నారు. చట్టాల పట్ల ఏమాత్రం అవగాహన లేని మంత్రులు 151 మంది గెలిచాం ఏమైనా చేస్తాం అని మాట్లాడుతున్నారన్నారు. కాగ్ నివేదిక ఇచ్చినా పట్టించుకోకుండా రాష్ట్రాన్ని అధోగతికి తీసుకు వెళ్తున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు అమ్ముతాం, హోదా ఇవ్వమని చెప్పినా ఏం చేయలేకపోతున్నారన్నారు. జగన్కు మిగిలింది ఒక్కటే.. మోదీ కాళ్ళు పట్టుకోవడమని వ్యాఖ్యానించారు. ఏ మాత్రం జంకు లేకుండా అన్ని అమ్మేస్తామని చెప్పినా మోదీని నిలదీయలేకపోతున్నారని అన్నారు. ఈ నెల 31న 11 గంటలకు పెరుగుతున్న ధరలకు నిరసనగా విజయవాడలో ఆందోళన చేపడుతున్నామని, 4న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, 7న విశాఖలో నిరసనలు తెలుపుతామని శైలజానాథ్ వెల్లడించారు.
కాగ్ తప్పు పట్టినా లెక్కలు చెప్పారా?
కేంద్రంలో మోడీని చూసి రాష్ట్రంలో జగన్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నారని శైలజనాథ్ ఆరోపించారు. సుమారు రూ. 55 వేల కోట్లకు లెక్కలు చూపలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్ ) తప్పు పట్టినా నోరు విప్పక పోవడం దుర్మార్గమన్నారు. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాళా తీయించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టంగా చెప్పినా నిలదీసి దమ్ము, ధైర్యం జగన్ రెడ్డికి, వైసీపీ ఎంపీలకు లేదని ఆరోపించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతామని చెప్పినా ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. అప్పులు పుట్టక కేద్రాన్ని ఆడుకుంటున్నారని, ప్రజా ప్యతిరేకమైన పాలనా కొనసాగిస్తున్నారని విమర్శించారు. మూడేళ్ళ జగన్ రెడ్డి పాలనలో అప్పులు…ఆదాయాల పై శ్వేతపత్రం విడుదల చేయాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.