విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమానికి అధికార యంత్రాంగం, సచివాలయ సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో పి.ఓ.యు.సి.డి. అరుణ, వెల్ఫేర్ అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వాలంటీర్లకు అందించనున్న ప్రతిభ పురస్కారాలపై ప్రధానంగా చర్చించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రస్తుతం 1,388 మంది వాలంటీర్లు విధులు నిర్వర్తిస్తుండగా.. అందులో 1,249 మంది ప్రతిభా పురస్కారాలకు ఎంపికైనట్లు అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వీరిలో సేవా వజ్ర పురస్కారానికి 5 మంది., సేవా రత్న పురస్కారానికి 8 మంది ఎంపిక కాగా 1,233 మంది సేవా మిత్ర పురస్కారానికి ఎంపికైనట్లు వివరించారు. తమ బాధ్యతలను ఉద్యోగంగా భావించకుండా, సేవా దృక్పథంతో పని చేస్తున్న వీరందరినీ ఘనంగా సత్కరించవలసిన అవసరం ఉందని మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి వాలంటీర్ల ప్రతిభా పురస్కారాల కార్యక్రమ నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశించారు. అనంతరం డివిజన్ల వారీగా సంక్షేమ కార్యక్రమాలపై ఆరా తీశారు. 6 స్టెప్ వేలిడేషన్ లోని పింఛన్ అప్లికేషన్స్ పై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. అనంతరం టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు డబ్బులు చెల్లింపుల గూర్చి అడిగి తెలుసుకున్నారు. దాదాపు రూ. 10.28 కోట్ల వరకు చెల్లింపులు జరుగుతున్నాయని.. వచ్చే వారంలో మరో రూ. 5.93 కోట్ల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు గడప గడపకూ కార్యక్రమానికి సంబంధించి అధికారులు, సచివాలయ సిబ్బంది వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు సహకరిస్తూ.. కార్యక్రమ విజయవంతానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. సమీక్షలో సి.డి.ఓ. జగదీశ్వరి, సి.ఓ.శ్రీకాంత్, కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, నాయకులు యరగొర్ల శ్రీరాములు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …